Homeతాజావార్తలుKishan Reddy | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. కాడి పడేసిన కిషన్​రెడ్డి.. సభలు పెట్టబోమని ప్రకటన!

Kishan Reddy | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. కాడి పడేసిన కిషన్​రెడ్డి.. సభలు పెట్టబోమని ప్రకటన!

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ప్రచారంలో వేగం పెంచాయి. సభలు, ర్యాలీలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. బీజేపీ నేత కిషన్​రెడ్డి మాత్రం తాము పెద్ద పెద్ద సభలు, ర్యాలీలు పెట్టొద్దని నిర్ణయించినట్లు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishan Reddy | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ప్రచారంలో దూసుకు పోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ మాత్రం వెనకబడిపోయింది.

ఓ వైపు బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్​ చేస్తున్న ప్రచారానికి ఊతం ఇచ్చేలా ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్​లో గెలుపు కోసం కాంగ్రెస్​ మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి సైతం రోడ్డు షోలు, బైక్​ ర్యాలీల్లో పాల్గొననున్నారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అన్ని డివిజన్లలో రోడ్​ షోలు నిర్వహించనున్నారు. రెండు చోట్ల బైక్​ ర్యాలీల్లో పాల్గొంటారు. అయితే బీజేపీ మాత్రం సభలు, ర్యాలీలు చేపట్టడం లేదని కిషన్​ రెడ్డి తాజాగా ప్రకటించారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా గురువారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ తరఫున పెద్ద ర్యాలీలు, సభలు పెట్టొద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Kishan Reddy | ఇంటింటి ప్రచారం చేస్తాం

ఓటర్లను ఇంటింటికి వెళ్లి కలిసి ఓట్లు వేయమని ప్రచారం చేస్తామని కిషన్​రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గం (Jubilee Hills Constituency) లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో సమస్యలకు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కారణమని విమర్శించారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉండగా.. అక్రమ కేసులు పెట్టించిందని, భూములను ఆక్రమించిందని ఆరోపించారు. మజ్లిస్​ అండతో మెజారిటీ ప్రజలపై దాడులు చేసిందన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం మజ్లిస్​ నాయకుడికి  టికెట్​ ఇచ్చిందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మజ్లిస్​ ఆదేశాలతో నడుస్తున్నారని విమర్శించారు. ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్​కు మెజారిటీ ప్రజలు ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. మజ్లిస్​ పార్టీ మద్దతు ఉంటే సరిపోతుందా అని నిలదీశారు.

Kishan Reddy | అధికారంలోకి వస్తాం..

కాంగ్రెస్​ పార్టీ (Congress Party) కుట్రలను జూబ్లీహిల్స్​ ప్రజలు అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్​లో బీజేపీ గెలవలేదన్నారు. ఒకసారి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ (BJP) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. తాము బీఆర్ఎస్​, కాంగ్రెస్​తో ఎప్పుడు కలవలేదన్నారు. గతంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కలిసి పోటీ చేశాయని గుర్తు చేశారు. బీజేపీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్​, మజ్లిస్​ కుటుంబ పార్టీలని విమర్శించారు.

Kishan Reddy | అయోమయంలో శ్రేణులు

రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అసలు పార్టీ ఏం చేస్తుందో తెలియక తికమక పడుతున్నారు. ఎంతో మంది కార్యకర్తలు పార్టీ కోసం స్వతహాగా పని చేస్తున్నారు. అయితే వారిలో చాలా మందికి పార్టీ తీసుకునే పలు నిర్ణయాలు నచ్చడం లేదు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక నాటి నుంచి రాష్ట్రంలో బీజేపీ బలహీనం అవుతూ వస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో (Jubilee Hills Elections) కొట్లాడాల్సిన సమయంలో తాము సభలు, ర్యాలీలు పెట్టడం లేదని కిషన్​ రెడ్డి అనడంతో కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్​ఎస్​, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్​ ప్రచారం చేస్తోంది. ఆ మాటలు నిజం చేసేలా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్​ సైతం ఇదే విషయమై గతంలో కిషన్​రెడ్డిని విమర్శించారు. జూబ్లీహిల్స్​లో ఏ పార్టీని గెలిపిస్తారని ప్రశ్నించారు.