అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెర పడింది. మంగళవారం ఎన్నిక ఉండటంతో ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్లో బిజీ అయిపోయాయి.
ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో నియోజకవర్గంలో గత 20 రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రోడ్ షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. దీంతో జూబ్లీహిల్స్ సందడిగా మారింది. ప్రస్తుతం ప్రచారానికి తెర పడటంతో మైక్‌లు మూగబోయాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Jubilee Hills by-election | నేతలంతా అక్కడే..
రాష్ట్రంలో స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానంలో గెలిస్తే స్థానిక ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది. దీంతో అన్ని పార్టీల ప్రధాన నేతలు అందరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. కాంగ్రెస్ అయితే మంత్రులకు డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వార్డుల్లో జోరుగా ప్రచారం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ (BRS) తరఫున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు. గత పది రోజులుగా రాష్ట్రంలోని నేతలంతా జూబ్లీహిల్స్లోనే తిష్ట వేశారు.
Jubilee Hills by-election | ఏర్పాట్లు పూర్తి
ఉప ఎన్నిక ఈ నెల 11 జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 50 శాతంలోపే ఓటింగ్ జరిగింది. ఉప ఎన్నిక కావడం, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సారి 60శాతం వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. 2,060 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పారా మిలిటరీ బలగాలను మోహరించనున్నారు.
