అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nirmal BRS | బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. సంస్థగత కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు.
సంస్థగత నిర్మాణంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయితే త్వరలో కమిటీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో నిర్మల్ (Nirmal) జిల్లా అధ్యక్షుడిగా జాన్సన్ నాయక్‌కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్మల్ జిల్లా నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన సీట్లపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
Nirmal BRS | పార్టీ నిర్మాణంపై ఫోకస్
నిర్మల్ జిల్లాలో పార్టీ పునర్నిర్మాణంపై కేటీఆర్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో సాధించిన సీట్లపై చర్చించారు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ గట్టి పోటినిచ్చిందని ఆయన ప్రశంసించినట్లు తెలిసింది. అయితే మూడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయగల నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని కేటీఆర్ చూస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితుడైన భూక్యా జాన్సన్ నాయక్ (Johnson Naik)కు పార్టీ జిల్లా పగ్గాలు ఇస్తారని సమాచారం. ఆయన ప్రస్తుతం ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.
Nirmal BRS | జాన్సన్ నాయక్ నేపథ్యం
జాన్సన్ నాయక్ కేటీఆర్‌కు సన్నిహితుడు. నిజాం కాలేజీ (Nizam College), ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్నాడు. అనంతరం కొన్నేళ్లు విదేశాల్లో ఉద్యోగం చేశాడు. స్వదేశానికి వచ్చిన అనంతరం బీఆర్ఎస్లో చేరాడు. 2023 ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. బీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను పక్కన పెట్టి జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది. అయితే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు చేతిలో నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినా.. పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి బీఆర్ఎస్ అభ్యర్థులు సీట్లు సాధించడానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఆయనకే జిల్లా పార్టీ పగ్గాలు ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేటీఆర్ పార్టీ జిల్లా నేతలతో సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జిల్లాలోని 18 మండలాల నేతలతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.