అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jogi Ramesh | ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేశ్ (jogi Ramesh), ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం తయారీ కేసులో (liquor scam case) నవంబర్ 13 వరకు రిమాండ్ విధించారు. అర్థరాత్రి తర్వాత న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరచగా సోమవారం ఉదయం 5 గంటలకు రిమాండ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అనంతరం వారిని విజయవాడ సెంట్రల్ జైలుకు (Vijayawada Central Jail) తరలించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా (NTR district) ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో జోగి రమేశ్‌ను, ఆయన సోదరుడిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లి దాదాపు 12 గంటలపాటు ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధనరావుతో ఉన్న సంబంధాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Jogi Ramesh | ఫోన్లు, సీసీటీవీ ఫుటేజీ సీజ్
అరెస్ట్ అనంతరం అధికారులు జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు నిర్వహించి, ఆయన భార్యతో పాటు ఇద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేశారు. ఈ ఫోన్లు, ఫుటేజీల్లో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్ధనరావు (ఏ1) ఇటీవల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేశ్ పేరును ప్రస్తావించాడు. తనకు జోగి రమేశ్ ప్రోత్సాహం ఇచ్చి, రూ.3 కోట్లు సాయం చేస్తానని చెప్పడంతోనే నకిలీ మద్యం తయారీలోకి దిగానని తెలిపారు. అలాగే జయచంద్రారెడ్డి (Jaya Chandra reddy) సహాయంతో యూనిట్‌ను ఇబ్రహీంపట్నం నుంచి తంబళ్లపల్లికి మార్చాలని సూచించారని వెల్లడించారు.
విచారణ అనంతరం సిట్ అధికారులు జోగి రమేశ్‌ను విజయవాడ (Vijaywada) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయన అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు నవంబర్ 13 వరకు రిమాండ్ విధించింది. తాజా పరిణామాలతో ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
