అక్షరటుడే, ఇందూరు : Advanced Technology Centers | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు.
ప్రభుత్వం రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చిన 65 సెంటర్లను శనివారం మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్లో గల ఐటీఐలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఏటీసీ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో బోధన్ కమ్మర్పల్లి, భీమ్‌గల్ నిజామాబాద్‌లో 5 సెంటర్లు కామారెడ్డిలో 4 సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒక్కో ఏటీసీ కేంద్రానికి రూ.4.70 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు చెప్పారు. మొదటి ఏడాది 6 కోర్సుల్లో శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. క్రమంగా మార్కెట్ డిమాండ్‌ను బట్టి మరిన్ని ఆధునిక కోర్సుల్లో శిక్షణ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.
Advanced Technology Centers | టాటా కన్సల్టెన్సీతో ఒప్పందం..
టాటా కన్సల్టెన్సీ సంస్థతో (Tata Consultancy Company) ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తుందని తెలిపారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్మెంట్ గ్యారెంటీ ఉందన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో మల్టీ నేషనల్ కంపెనీలో ఆకర్షణీయమైన వేతనాలతో కొలువులు పొందే అవకాశం ఉంటుందన్నారు. స్వయం ఉపాధికి కూడా కోర్సులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ప్రిన్సిపాల్ యాదగిరి, ఇన్స్ట్రక్టర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.