అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Google Job | టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌లో ఉద్యోగం సాధించాలని చాలా మంది కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అనంతపురం జిల్లా (Anantapur District) కు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.2.25 కోట్లతో గూగుల్‌లో ఉద్యోగం సాధించాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri)కి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేశ్‌రెడ్డి, అంబిక దంపతుల కుమారుడు సాత్విక్‌రెడ్డి న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీ (Google Company)లో ఆయన ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ.2.25 కోట్ల వేతనంతో తన కుమారుడు ఉద్యోగం సాధించినట్లు రమేశ్‌రెడ్డి తెలిపారు. దీంతో పట్టణంలోని పలువురు రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడికి అభినందనలు తెలుపుతున్నారు.
అనంతపురం జిల్లా గుత్తి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దాదాఖలందర్ ఇటీవల రూ.51 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీటెక్ పూర్తి చేసిన దాదాఖలందర్ హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీలో ఎంటెక్ చదువుతున్నాడు. ఇంకా కోర్సు పూర్తి కాకముందే ఆయన ఏఎండీ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఎంపికల్లో జాబ్ కొట్టాడు. కంపెనీ అతనికి ఏడాదికి రూ.51 లక్షల వేతనంతో ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది.