అక్షరటుడే, వెబ్డెస్క్ : JEE Mains | జేఈఈ మెయిన్స్ కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక వార్త చెప్పింది. జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. జనవరి 21 నుంచి 30 మధ్య మొదటి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల నుంచే ప్రారంభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందన్నారు. సెషన్ –2 పరీక్షకు జనవరిలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో నిర్వహిస్తుంది.
పరీక్ష తేదీలను షెడ్యూల్ చేస్తూ NTA ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది. JEE మెయిన్ పరీక్ష రెండు దశలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి విద్యార్థులు తమ పత్రాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
ఆధార్ కార్డులో, పదో తరగతి మెమోలో పుట్టిన తేది ఒకేలా ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి. తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు ఆధార్ కార్డులో ఉండాలి. సంబంధిత రిజర్వేషన్లు పొందే విద్యార్థులు కొత్త సర్టిఫికెట్లు తీసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.nta.ac.in, https://jeemain.nta.nic.in వెబ్సైట్లను సందర్శించాలని అధికారులు సూచించారు. కాగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఎంతోమంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు సన్నద్ధం అవుతుంటారు.