అక్షరటుడే, వెబ్డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్‌ను కలవడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రిలోని రిసెప్షనిస్టుపై దాడికి దిగాడు. ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రలోని శ్రీబాల్ హాస్పిటల్(Sribal Hospital)లో డాక్టర్ ఒక ప్రైవేట్ మీటింగ్‌లో ఉన్నారు. ఆ సమయంలో గోకుల్ ఝా అనే వ్యక్తి హాస్పిటల్‌కి వచ్చాడు. డాక్టర్‌ను కలవాలని ఆయన కోరగా.. మీటింగ్‌లో ఉన్నారు.. కొద్ది సేపు వేచి ఉండాలని రిసెప్షనిస్ట్ సోనాలి ప్రదీప్ కలసారే సూచించారు.
Maharashtra | దారుణాతి దారుణం..
వేచి ఉండమని చెప్పగానే గోకుల్ ఝా తీవ్రంగా ఆగ్రహించాడు. అక్కడే సోనాలిపై దాడి చేయడంతో పాటు, ఆమె జుట్టు పట్టుకుని లాగి దుర్భాషలాడాడు. దాడి సమయంలో అతను మత్తులో ఉన్నట్లు ప్రత్యక్షసాక్షుల అభిప్రాయం. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం దృశ్యాలు హాస్పిటల్ రిసెప్షన్ (Hospital Reception)లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాధితురాలు సోనాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గోకుల్ ఝాను అదుపులోకి తీసుకున్నారు.
మహిళపై దాడి, అసభ్య పదజాలం, మహిళా గౌరవాన్ని అవమానించడం వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాము అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుహాస్(Assistant Police Commissioner Suhas) హేమాడే వెల్లడించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత ఏమైంది? ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్(Film actress Janhvi Kapoor) కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. ఇలాంటి ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, అతడిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తులని ఎన్నటికి క్షమించకూడదని పేర్కొంది. ఈ ఘటనని సీరియస్‌గా తీసుకోకపోతే సిగ్గు చేటు అంటూ జాన్వీ కపూర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇతర సెలబ్రిటీలు(Celebrities) కూడా ఈ ఘటనని ఖండిస్తున్నారు.
కాగా సదరు రిసెప్షనిస్ట్ మొదట దాడికి పాల్పడిన వ్యక్తి బంధువుపై దాడికి పాల్పడింది. మొదట వారి మధ్య వాగ్వాదం జరగ్గా.. రిసెప్షనిస్ట్ గోకుల్ ఝా బంధువుపై దాడి చేసింది. అంతేగాకుండా వారిపై అరిచింది. దీంతో ఆయన ఆగ్రహంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.