అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Janasena | జనసేన పార్టీలో ఇటీవల ఒక రకమైన నిశ్శబ్దం కనిపిస్తోంది. ఒకప్పుడు క్యాడర్ నుంచి నేతల వరకూ ఉత్సాహంగా స్పందించే జనసేనలో, ప్రస్తుతం నోటికి తాళం వేసుకున్న పరిస్థితి నెలకొంది. గతంలో కనిపించిన జోష్ ఇప్పుడు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా రెండేళ్లుగా నామినేటెడ్ పదవులు, నియోజకవర్గాల పరంగా తమను టీడీపీ నేతలు (TDP Leaders) పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఈ సైలెన్స్‌కు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌పై ప్రత్యర్థులు చేసే విమర్శలకు కూడా పార్టీ నేతలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.
Janasena | సైలెన్స్‌కి కారణం ఏంటి?
ఇటీవల కోనసీమ కొబ్బరి అంశంపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందించినా.. వాటిని ఖండించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తప్ప మరెవరూ ముందుకు రాలేదు. అందులోనూ కోనసీమ నుంచి ఒక్క నేత కూడా స్పందించకపోవడం పార్టీలోని నిశ్శబ్దానికి నిదర్శనంగా మారింది. సోషల్ మీడియాలోనూ పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా వచ్చే పోస్టులు గణనీయంగా తగ్గిపోయాయి. ఒకప్పుడు చిన్న విమర్శ వచ్చినా ఎదురుదాడి చేసే క్యాడర్, ఇప్పుడు మౌనంగా ఉండడం పార్టీకి డేంజర్ సిగ్నల్స్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024 ఎన్నికల ముందు, తర్వాత జనసేనలో పరిస్థితులు గణనీయంగా మారిపోయాయని నేతలే చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఇద్దరు మంత్రులను మినహాయిస్తే సుమారు 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా వారి నుంచి కూడా పెద్దగా స్పందన కనిపించడం లేదు. గతంలో సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్‌గా ఉన్న క్యాడర్, తమ సమస్యలను పట్టించుకునే వారు పార్టీలో లేరన్న భావనతో నైరాశ్యంలోకి వెళ్లిందని సమాచారం. ఈ సంకేతాలను ఇప్పటికైనా పవన్ కల్యాణ్ గమనించి క్యాడర్‌కు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాలని, వారితో నేరుగా సమావేశమై భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని జనసేన నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.