అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jana Sena Municipal Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు (Telangana municipal elections) సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ (Janasena party) సైతం బరిలో నిలిచింది. రాష్ట్రంలోని 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 48 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్‌నగర్ 44, కొత్తగూడెం 22, మహబూబాబాద్ –5, రంగారెడ్డి–21, మెదక్ 18, ఖమ్మం 17, కరీంనగర్ 56, వరంగల్ 20, నల్గొండ 46, ఆదిలాబాద్ జిల్లాలో 39 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Jana Sena Municipal Elections | ప్రచారంపై వెనక్కి..
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పవన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన తెలంగాణలో ప్రచారం చేస్తారని చెప్పారు. అయితే జనసేనతో పొత్తు, పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి పవన్ అని పీసీసీ చీఫ్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఆయన ప్రచారం చేస్తే నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు నాయకులు భావించినట్లు సమాచారం. మరోవైపు జనసేన అభ్యర్థులు సైతం 336 వార్డుల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నారు.