అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jana Nayagan Audio Launch | దళపతి విజయ్ (Vijay Thalapathy) నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, విజయ్ రాజకీయ జీవితానికి దోహదపడేలా రూపుదిద్దుకుంటున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఈసారి చెన్నైలో కాకుండా విదేశాల్లో నిర్వహించనున్నారు. మలేషియాలోని ప్రతిష్టాత్మక బుకిత్ జలీల్ స్టేడియంలో ఈ వేడుకను డిసెంబర్ 27న అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమాన్ని భారీ జనసమూహంతో నిర్వహిస్తూ, విజయ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. రాజకీయ ప్రచారానికి కూడా ఈ వేదిక ఉపయోగపడేలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారనే చర్చ జరుగుతోంది.
Jana Nayagan Audio Launch | పోలీసుల కండీషన్స్..
అయితే మలేషియా పోలీసులు (Malaysian Police) ఈ కార్యక్రమానికి కొన్ని షరతులు విధించినట్టు సమాచారం. ఇది పూర్తిగా సినిమా సంబంధిత వేడుక మాత్రమేనని, రాజకీయ కార్యక్రమంగా మారకూడదని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ జెండాలు, రాజకీయ ప్రసంగాలకు అనుమతి ఉండకూడదని వారు స్పష్టం చేసినట్లు టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తమిళనాడు (Tamil Nadu)లో ఇలాంటి భారీ ఈవెంట్లకు అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని, అభిమానులకు ఇబ్బంది కలగకుండా విదేశాల్లో ఆడియో లాంచ్ నిర్వహిస్తే సజావుగా సాగుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అలాగే స్థానిక రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉండాలన్న ఉద్దేశం కూడా ఉందని వినిపిస్తోంది.
‘జన నాయగన్’ సినిమాలో విజయ్‌తో పాటు మమితా బైజు (Mamitha Baiju) , బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక భావోద్వేగం నెలకొంది. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పి, రాజకీయాలపైనే దృష్టి సారించనున్నారని, అందుకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని సమాచారం. బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జనవరి 10న ‘పరాశక్తి’ విడుదల కానుండగా, తెలుగులో అదే సమయంలో ప్రభాస్, చిరంజీవి సినిమాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి. అయినప్పటికీ, విజయ్ క్రేజ్ దృష్ట్యా ‘జన నాయగన్’ రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.