అక్షరటుడే, హైదరాబాద్: Jan 17 Gold Prices | భారతీయుల జీవితంలో బంగారానికి Gold ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను అలంకరణగా మాత్రమే కాకుండా సంప్రదాయం, హోదాకు ప్రతీకగా భావిస్తారు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో అయితే బంగారం కేవలం ఆభరణంగానే కాకుండా, సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా మారింది.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బంగారం, వెండిపై పెట్టుబడులను మరింత పెంచాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, ఇరాన్లో ఉద్రిక్తతలు, వెనెజువెలాలో రాజకీయ మార్పుల వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి.
Jan 17 Gold Prices | తగ్గిన ధరలు..
మరోవైపు కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సంకేతాలు ఇవ్వడం వంటి కారణాలతో ఇటీవల గోల్డ్, సిల్వర్ ధరలు Silver Prices అంతర్జాతీయంగా, దేశీయంగా ఆల్టైమ్ హై స్థాయిలకు చేరాయి. అయితే ఆ గరిష్ఠాల తర్వాత ఇప్పుడు వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి ఇవాళ రూ. 200 తగ్గి రూ. 1,31,450కు చేరింది. అంతకు ముందు రోజు కూడా రూ. 350 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఇవాళ రూ. 220 తగ్గి రూ. 1,43,400 వద్ద నిలిచింది. ముందు రోజు ఇది రూ. 380 తగ్గడం గమనార్హం.
బంగారం వెంటనే వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ఇవాళ రూ. 4,000 తగ్గి రూ. 3,06,000 వద్ద ఉంది. అయితే గత కొన్ని రోజుల్లో వెండి ధరలు భారీగా ఎగబాకాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ. 42 వేల వరకు పెరగడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్వల్ప సవరణ కనిపిస్తోంది.
గత రోజు ఔన్సుకు 4,620 డాలర్లకు పైగా ట్రేడైన స్పాట్ గోల్డ్ ప్రస్తుతం 4,596.75 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర Silver Price ఔన్సుకు 90.13 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.81 వద్ద కొనసాగుతోంది. గరిష్ఠాల నుంచి వచ్చిన ఈ స్వల్ప తగ్గుదల రాబోయే రోజుల్లో ధరల దిశపై ఆసక్తిని పెంచుతోంది.