అక్షరటుడే, వెబ్‌డెస్క్: Avatar 3 Trailer | ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను విభిన్న ప్రపంచాల్లోకి తీసుకెళ్లిన ‘అవతార్’ (Avatar) సిరీస్ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు విజువల్‌గా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో భావోద్వేగంతో ప్రేక్షకుల్ని మాయలోకంలోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) పేరిట మూడో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. మాస్టర్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన ఈ భాగానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈసారి కథలో అగ్ని అంశం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలుస్తోంది.
Avatar 3 Trailer | ట్రైలర్ అదిరింది..
టైటిల్‌లోని ‘ఫైర్ అండ్ యాష్’ (అగ్ని మరియు బూడిద) పేరు చూస్తే యుద్ధం అనంతర పరిణామాలను ప్రతిబింబించేలా ఉంది. ట్రైలర్ చూస్తే, ఈసారి కథ మరింత గంభీరంగా, ఉద్వేగభరితంగా సాగనుందని స్పష్టమవుతోంది.
సెకండ్ పార్ట్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో పండోర గ్రహంలోని సముద్ర ప్రదేశాలు ప్రధానంగా చూపించగా.. ఇప్పుడు థర్డ్ పార్ట్‌లో మరో కొత్త ప్రాంతాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ కొత్త ప్రపంచంలో కొత్త జీవులు, విభిన్న జీవన శైలి, కొత్త పాత్రలు అన్నీ కలగలిపి థియేటర్‌లో (Theatre) అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మొదటి అవతార్ 2009లో విడుదల కాగా, రెండవ భాగం 2022లో వచ్చింది. ఇప్పుడు మూడో పార్ట్ తర్వాత ‘అవతార్ 4’ను 2029లో, ‘అవతార్ 5’ను 2031 డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ దాదాపు 160 భాషల్లో విడుదలైంది. ఈసారి కూడా అంతే స్థాయిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ట్రైలర్ (Trailer) విడుదల తర్వాత మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను చూసేందుకు చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.