అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Diwali Sweet | దీపాల పండుగ సందడి దేశమంతా మొదలైంది. హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగ దీపావళి ఈసారి అక్టోబర్ 20న జరగనుండటంతో, దేశమంతా దీపాల వెలుగుల్లో మెరిసిపోనుంది.
కొత్త దుస్తులు, టపాసులు, అలంకరణలతో పాటు ప్రతి ఇంటి వంటగదిలో స్వీట్లు వాసన పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్‌లో తయారైన ఒక ప్రత్యేక స్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జైపూర్‌లోని ఒక ప్రసిద్ధ స్వీట్ కంపెనీ (Sweet Company) తాజాగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఈ ప్రత్యేక మిఠాయి పేరు ‘స్వర్ణ ప్రసాదం’ . దీని ధర విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక కిలో స్వీట్ ధర అక్షరాలా రూ.1,11,000.
Diwali Sweet | ఇంత రేటుకి కారణం ఏంటి?
ఈ అధిక ధరకు ప్రధాన కారణం ఇందులో ఉపయోగించిన విలువైన పదార్థాలు. తయారీదారుల సమాచారం ప్రకారం, ఈ స్వీట్‌లో స్వర్ణ భస్మం (బంగారు భస్మం), కుంకుమపువ్వు, ప్రీమియం గింజలు, ఆయుర్వేద పదార్థాలు వాడారు. సాధారణ స్వీట్ల కంటే విభిన్నంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మిఠాయిని తయారు చేశారు. బంగారు భస్మం కలయికతో పాటు, శరీరానికి శక్తినిచ్చే సువాసన ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఉపయోగించారు. దీన్ని తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘స్వర్ణ ప్రసాదం’ (Swarna Prasadam)ను కొనుగోలు చేసే వారికి ఒక లగ్జరీ అనుభూతి ఇవ్వడం కోసం, ఈ స్వీట్లను బంగారు పూతతో కూడిన పళ్లెంలో అందిస్తున్నారు. దీని వల్ల ఇది కేవలం రుచికే కాదు, బహుమతి ఇచ్చే వారి ప్రతిష్ఠ, స్టైల్‌ను కూడా ప్రతిబింబిస్తుంది. దీపావళి సందర్భంగా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి ఇది కొత్త ట్రెండ్‌గా మారుతోంది.
‘స్వర్ణ ప్రసాదం’తో పాటు ఈ దీపావళికి జైపూర్ మార్కెట్లో (Jaipur Market) మరికొన్ని ప్రీమియం మిఠాయిలు కూడా అందుబాటులోకి వచ్చాయి. స్వర్ణ భస్మ స్వీట్ (బంగారం): రూ. 85,000 కిలోకు, చాంది భస్మ స్వీట్ (వెండి): రూ. 58,000 కిలోకు. దీపావళి రోజున లక్ష్మీ పూజ అనంతరం స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఇటువంటి ప్రత్యేక, లగ్జరీ స్వీట్లు బంధుమిత్రులకు ఆనందాన్ని పంచుతూ పండుగను మరింత మధురంగా మార్చేస్తున్నాయి. ప్రస్తుతం ‘స్వర్ణ ప్రసాదం’ జైపూర్‌లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది , కానీ త్వరలోనే దేశవ్యాప్తంగా దీనిని ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రణాళిక ఉందని తయారీదారులు తెలిపారు. దీపాల వెలుగుతో పాటు ఈ బంగారు స్వీట్ రుచితో పండుగ మరింత ప్రకాశవంతం కానుంది!