అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagtial Congress Rebellion | మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. స్వతంత్రంగా పోటీ చేసిన ఆయన అభ్యర్థులు 14 మంది విజయం సాధించారు.
జగిత్యాల కాంగ్రెస్ (Jagtial Congress)లో వర్గపోరు నెలకొన్న విషయం తెలిసిందే. సీనియర్ నేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కు మధ్య పొసగడం లేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరడాన్ని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు పార్టీపై, ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు సైతం చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి వర్గానికి మొండి చెయ్యి చూపింది. ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) వర్గానికి 30 సీట్లు ఇచ్చి, జీవన్‌రెడ్డి అనుచరులకు 20 సీట్లు మాత్రమే ఇచ్చారు. అందులో ఒక బీ ఫామ్‌ను జిల్లా అధ్యక్షుడు చించివేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
Jagtial Congress Rebellion | స్వతంత్రంగా బరిలోకి..
తమకు అన్యాయం జరగడంతో జీవన్‌రెడ్డి అనుచరులు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా బరిలోకి దిగారు. జీవన్‌రెడ్డి సైతం వారికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 12, బీజేపీ 4,బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 చోట్ల గెలిచాయి. మొత్తం 50 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో మెజారిటీ మార్కు 26 స్థానాలు. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ కలిస్తే అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. జీవన్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. తన అనుచరులకు ఛైర్పర్సన్ పదవి ఇవ్వమని ఆయన అడిగే అవకాశం ఉంది.