అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagtial Chairperson Dispute | కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల (Jagtial )లో మున్సిపల్ సీట్ల కేటాయింపులో తన వర్గం వారికి అన్యాయం చేశారన్నారు.
జగిత్యాల కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Jeevan Reddy), ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు తక్కువ టికెట్లు కేటాయించడంతో జీవన్‌రెడ్డి వారిని స్వతంత్రంగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. దీంతో జగిత్యాలలో హంగ్ వచ్చింది. అయితే మున్సిపల్ పీఠం కోసం జీవన్‌రెడ్డి, సంజయ్ వర్గం వేర్వేరుగా క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది.
Jagtial Chairperson Dispute | సయోధ్య కుదిర్చే యత్నం
సీనియర్ నేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం ఉదయం ఎమ్మెల్యేతో సమావేశం అయ్యారు. సాయంత్రం జీవన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం జీవన్‌రెడ్డి ఏఐసీసీ సెక్రెటరీ సవాంగ్‌ను తన వర్గం కౌన్సిలర్లతో కలిశారు. ఆయనకు ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 50 వార్డులు ఉంటే తన వర్గానికి 16 బీ ఫాంలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. అందులో 9 మందిని గెలిపించుకున్నట్లు చెప్పారు. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్లుగా గెలిచారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేకు 34 బీ ఫారంలు ఇస్తే 14 మంది మాత్రమే విజయం సాధించారన్నారు.
జగిత్యాల నాయకుల ముందు పార్టీ పెద్దలు రెండు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. ఒకరికి ఛైర్మన్ పదవి, మరొకరికి వైస్ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. రెండో ప్రతిపాదనగా చెరో రెండున్నరేళ్లు ఛైర్మన్ పీఠం పంచుకునేలా ఇరు వర్గాలకు సూచన చేశారు. అయితే కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్మన్ పీఠం ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.