అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జనంబాటలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత మరోసారి బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. తన మనసు విరిగిపోయిందని, మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందన్నారు. అయితే అదే పేరుతోనా.. కొత్త పేరు పెడతామా అనేది తర్వాత తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో 2029 అసెంబ్లీ ఎన్నికలు (assembly elections) వచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె చెప్పారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు.
Kavitha Janam Bata | నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు.
బీఆర్ఎస్లో (BRS party) ఉన్నప్పుడే తన కుటుంబంలో పలు ఘటనలు జరిగాయన్నారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారన్నారు. తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా తనను పార్టీ వాళ్లే ఓడించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం తాను వద్దన్నా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పారు. తాను ఎంపీ అడిగితే ఎమ్మెల్సీ చేశారన్నారు.
Kavitha Janam Bata | ఏం చేశారని వేడుకలు
రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని రైజింగ్ తెలంగాణ వేడుకలు నిర్వహించారని కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. విద్యారంగంలో గద్వాల జిల్లా వెనుకబడి ఉందన్నారు. దీనిపై పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా జాగృతి ప్రజల మధ్య ఉంటుందన్నారు. రాజకీయ నాయకుడు ప్రజల మధ్య ఉండాలని ఆమె అన్నారు. తన జనంబాట కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందన్నారు.