అక్షరటుడే, హైదరాబాద్: Jaggareddy | కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (TPCC Working President Jaggareddy) ఫైర్ అయ్యారు. ప్రజలకు మేలు చేస్తారని బీజేపీకి ప్రజలు మూడు సార్లు పట్టం కడితే మోదీ, అమిత్ షాలు (Modi and Amit Shah) మాత్రం.. గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ, నెహ్రూ మీలా క్రిమినల్స్ కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో (Gandhi Bhavan) బుధవారం మీడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ ‘రఘుపతి రాఘవ రాజారామ్ పతిత పావన సీతారామ్’ అంటూ 1930లోనే సత్యాగ్రహం మొదలు పెట్టారన్నారు. ఆయన రాముడి గురించి చెప్పిన రోజుల్లో మోదీ, అమిత్ షాలు పుట్టలేదని వ్యాఖ్యానించారు. గాంధీ, నెహ్రూల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.
Jaggareddy | అధికారం శాశ్వతం కాదు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, యువతను పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని అన్నారు. నెహ్రూ, గాంధీపై కుట్రకు నిరసనగా సంగారెడ్డిలో లక్ష మందితో సభ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.