అక్షరటుడే, అమరావతి: YS Jagan : వైఎస్సార్ సీపీ (YSRCP) అభిమాని సింగయ్య మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బులెట్ ప్రూఫ్ కారును మంగళవారం సీజ్ చేశారు.
ఇటీవల పల్నాడులో జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సింగయ్య ఆయన కాన్వాయ్ కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. తొలుత ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆయన మృతి చెందాడని అంతా భావించారు. కానీ, ఆయన జగన్ వాహనం కింద పడి చనిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. సీసీ ఫుటేజీల(CCTV footage)ను నిశితంగా పరిశీలించిన పోలీసులు.. సింగయ్య జగన్ కారు కింద పడి మరణించినట్లు గుర్తించారు. దీంతో ఏ-1గా వాహన డ్రైవరు రమణారెడ్డి ఏ-2గా జగన్, ఏ-3గా వాహన యజమాని జగన్ మీద కేసులు నమోదు చేశారు.
ఇప్పటికే డ్రైవరు రమణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు సింగయ్య మీద నుంచి వెళ్లిన సఫారీ వాహనాన్ని సీజ్ చేశారు. తాజాగా ప్రమాదానికి కారణమైన వాహనమని పేర్కొంటూ.. జగన్కు చెందిన బులెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వచ్చిన నల్లపాడు పోలీసులు పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య మృతి కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, అందులో భాగంగానే వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బలవంతంగా అక్కడి నుంచి బులెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకుని వెళ్లారు.