అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu) పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం అన్నదాతలు (Farmers) ఎరువుల కోసం బారులు తీరారన్నారు. రైతుల కోసం పోరాటాలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
YS Jagan | బ్లాక్ మార్కెట్‌కు ఎరువులు
వైసీపీ పాలనలో రైతులు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదని జగన్ పేర్కొన్నారు. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్‌బీకేలు, ఈ క్రాప్, పీఏసీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎరువులను టీడీపీ (TDP) నేతలే పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఇది రూ.250 కోట్ల కుంభకోణం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం పోరాడుతున్న తమకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
YS Jagan | గొంతు నొక్కుతున్నారు
కూటమి ప్రభుత్వం స్కామ్‌లు చేసి డబ్బులు దండుకోవాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతోందన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతోందా.. దోపిడీదారుల కోసమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే ప్రజల గొంతును ప్రభుత్వం రెడ్‌బుక్ (Red Book) పేరిట నొక్కుతోందన్నారు. చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.