అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP MLA Rivaba Jadeja | టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేలు, టెస్ట్‌లు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
తన భర్తను ప్రశంసించే క్రమంలో ఆమె టీమిండియాలోని (Team India) ఇతర క్రికెటర్లపై పరోక్షంగా ఆరోపణలు చేయడంతో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో ఇవి భారీ చర్చకు దారితీశాయి. వివరాల్లోకి వెళ్తే.. రివాబా ఒక బహిరంగ రాజకీయ సభలో మాట్లాడుతూ రవీంద్ర జడేజాను (Ravindra Jadeja) చూసి గర్వంగా ఫీలవుతున్నట్టు పేర్కొంది. “నా భర్త క్రికెట్ కారణంగా లండన్, దుబై, ఆస్ట్రేలియా (Australia) వంటి అనేక దేశాలకు వెళ్లినా ఎప్పుడూ చెడు అలవాట్లకు లోనుకాలేదు. తన బాధ్యతలు, తన క్రమశిక్షణ, తన విలువలు ఎంత గొప్పవో అందరికీ తెలుసు” అని ఆమె పేర్కొన్నారు.
BJP MLA Rivaba Jadeja | ఇలా అనేసింది ఏంటి..
ఇదే సమయంలో వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. “విదేశీ టూర్స్‌కు వెళ్లినప్పుడు టీమిండియాలోని చాలా మంది ఆటగాళ్లు చెడు కార్యకలాపాలు చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నా భర్త మాత్రం నిజాయితీగా, పద్ధతిగా ఉంటాడు” అని ఆమె వ్యాఖ్యానించింది. తాను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పారో రివాబా (BJP MLA Rivaba Jadeja) స్పష్టం చేయలేదు. కానీ మొత్తం జట్టుపై విమర్శల వాన కురిపించినట్టుగా ఉండడంతో ఈ వ్యాఖ్యలు నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఇతర క్రికెటర్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మీ భర్తను పొగిడేందుకేనా మొత్తం జట్టును బ్యాడ్ చేస్తున్నారు. ఇలాంటి అసభ్యకరమైన ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయడం సరికాదు” అని నెటిజన్లు మండిపడుతున్నారు.
మరోవైపు, జట్టులో ఐక్యత, వాతావరణం, ఆటగాళ్ల మానసికస్థితిపై ఇలాంటి వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పైగా.. రవీంద్ర జడేజా ఇటీవలే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ఊపందుకుంది. ఇప్పటికే సోషల్ మిడియాలో #StopDefamingTeamIndia, #RavibaJadeja వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. రివాబా చేసిన ఈ వ్యాఖ్యలకు అధికారికంగా స్పష్టీకరణ ఇస్తారా? లేదా ఈ అంశంపై జడేజా స్పందిస్తారా? అనేది ఇప్పుడు స్పోర్ట్స్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మీద, రివాబా వ్యాఖ్యలు టీమిండియా అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి