అక్షరటుడే, వెబ్డెస్క్ : Jadcharla MLA | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తరచూ వ్యాఖ్యలు చేస్తున్న ఆయన మరోసారి అలాగే మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మరో రెండుసార్లు గెలిస్తే తాను కూడా ముఖ్యమంత్రి (Chief Minister) అభ్యర్థిని అవుతానని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే తాను కూడా సీఎం అభ్యర్థిని అవుతానని ఎమ్మెల్యే అన్నారు. రీజినల్ పార్టీల్లో అలాంటి పరిస్థితి ఉండదని, కానీ కాంగ్రెస్ పార్టీలో (Congress Party) అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు. పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, ఎవరికైనా అవకాశాలు వస్తాయన్నారు. జడ్చర్ల నియోజకవర్గం (Jadcharla constituency) ప్రజలు ఎన్నో ఆశలతో తనను గెలిపించారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతకైనా పోరాడుతానని చెప్పారు. ఇంకో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తాను కూడా సీఎం అభ్యర్థిని అవుతానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని (Revanth Reddy) గెలిపించారని, అక్కడ అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. జడ్చర్లలో నన్ను మరో రెండుసార్లు గెలిపిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.
Jadcharla MLA | నిధులన్నీ వాళ్లకేనా?
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని అనిరుధ్ రెడ్డి అన్నారు. మంత్రులుగా ఉన్న నియోజకవర్గాలకే నిధులు ఇవ్వడం, ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం మంచిది కాదన్నారు. అందరికీ నిధులు ఇవ్వాలని కోరితే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నట్లు తనపై ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకసారి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో (Kodangal Assembly constituency) చూడండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎత్తి చూపారు. మంత్రుల నియోజకవర్గాలలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కానీ మిగతా నియోజకవర్గాలకు నిధులు రావడం లేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయిస్తే, ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లినప్పుడు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు కేటాయించే అవకాశం వస్తుందన్నారు.