అక్షరటుడే, కామారెడ్డి: Ganesh immersion | గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదిరోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఆదిదేవుడు నిమజ్జనానికి బయకుదేరి వెళ్లే సమయం ఆసన్నమైంది.
పండుగ రోజు భారీ వర్షం, వరదల కారణంగా ప్రశాంతంగా జరుపుకోలేని భక్తులు శోభాయాత్ర (Ganesh Shobhayatra) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కామారెడ్డి పట్టణంలో శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర ముగిసే వరకు పోలీసుల నిఘా కొనసాగనుంది. 24 గంటలకు పైగా సాగే శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Ganesh immersion | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణం (Kamareddy City) గణేశ్ నిమజ్జనానికి పెట్టింది పేరు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) తర్వాత అదే స్థాయిలో శోభాయాత్ర జరిగే ప్రాంతం కామారెడ్డి. ఇక్కడి శోభాయాత్రను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు వస్తుంటారు. పదో రోజైన శుక్రవారం సాయంత్రం గణేశులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మండపాల నుంచి నిమజ్జనానికి తరలిస్తారు. శుక్రవారం సాయంత్రం మొదలైన శోభాయాత్ర శనివారం రాత్రి వరకు రెండు రోజుల పాటు కొనసాగనుంది.
Ganesh immersion | ఈసారి నంబర్ సిస్టం ఎత్తివేత
ప్రతిఏడాది నిమజ్జనం సాఫీగా సాగేలా నిర్వాహకులు ప్రతి వినాయకుడికి ఒక నంబర్ విధానాన్ని అమలు చేసేవారు. దాంతో నంబర్ ప్రకారమే వినాయకులు ముందుకు సాగేవి. అయితే నంబరింగ్ విధానం వల్ల శోభాయాత్ర ఆలస్యం కావడంతో పాటు గొడవలకు దారి తీస్తుందని పోలీసులు మండపాల నిర్వాహకులు, పట్టణ ప్రజలతో మాట్లాడి ఈసారి నంబర్ సిస్టం లేకుండా శోభాయాత్ర సాఫీగా సాగేలా ప్లాన్ చేస్తున్నారు.
Ganesh immersion | రైల్వేస్టేషన్ గణపతికి మొదటి పూజ
ప్రతి ఏడాది నిమజ్జనం రైల్వే స్టేషన్ గణపతితో మొదలు కావడం ఆనవాయితీగా వస్తోంది. స్టేషన్ గణపతికి ధర్మశాల వద్ద స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించనున్నారు. ఇందిరాచౌక్ వద్ద విశ్వహిందూ పరిషత్, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై మండపాల నిర్వాహకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Ganesh immersion | శోభాయాత్ర సాగేదిలా..
పట్టణంలోని ధర్మశాల నుంచి రైల్వే స్టేషన్ గణపతితో (Railway Stattion Ganapathi) శోభాయాత్ర ప్రారంభం కానుంది. ధర్మశాల నుంచి ఇందిరాచౌక్, బాంబే క్లాత్ హౌస్, సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్డు, పాంచ్ రాస్తా, పెద్దబజార్, రైల్వేకమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా (Nizamsagar Chowrastha), కొత్తబస్టాండ్ నుంచి టేక్రియాల్(అడ్లూరు ఎల్లారెడ్డి) (Adlur Ellareddy) చెరువు వరకు శోభాయాత్ర సాగనుంది. డీజేలకు పోలీసులు అనుమతులు నిషేధంతో డోలక్ చప్పుళ్లతో కామారెడ్డి పట్టణం మారుమ్రోగనుంది.
Ganesh immersion | పోలీసుల భారీ బందోబస్తు
పట్టణంలో శోభాయాత్ర ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాఫీగా సాగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోకి ఎలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. పట్టణంలో నుంచి రాకపోకలు సాగించే వాహనాల దారి మళ్లించారు. శోభాయాత్ర రూట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు పోలీస్ నిఘా కొనసాగనుంది. పోలీసులు మఫ్టీలో జనాల్లో కలిసిపోయి నిఘా పెట్టనున్నారు.
Ganesh immersion | చెరువు వద్ద ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి పట్టణం నుంచి శనివారం సాయంత్రం శోభాయాత్ర ముగించుకుని నిమజ్జనం కోసం వినాయకులను టేక్రియాల్ చెరువుకు తరలించనున్నారు. చెరువు వద్ద గత మూడు రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినాయకుల నిమజ్జనం కొనసాగుతుంది. చెరువు వద్ద మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
వాటర్ ప్రూఫ్ షామియానాలు వేశారు. రాత్రిపూట వెలుతురు కోసం ప్రత్యేక హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు సమాచారం కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. చెరువు వైపు వెళ్లకుండా డేంజర్ హెచ్చరికలతో బారికేడ్లు నిర్మించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలకు, నిమజ్జనం తర్వాత వెళ్లే వాహనాలకు దారులు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక
నిమజ్జనం పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్
గణపతులను నిమజ్జనం చేసే టేక్రియాల్ చెరువు