అక్షరటుడే, వెబ్డెస్క్ : Batukamma | బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే వేడుకిది. ఇది తొమ్మిది రోజుల ఉత్సవం. ఏటా మహాలయ అమావాస్య(Mahalaya Amavasya) రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. దుర్గాష్టమిన సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి.
తెలంగాణ(Telangana)కు ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ ఏడాది సెప్టెంబర్ 21న(ఆదివారం) పండుగ ప్రారంభమవుతుంది. 30వ తేదీన ముగుస్తుంది. ఆడ పడుచులు రోజూ గుమ్మడి, గునుగు, తంగెడు, కట్ల పూలు, సీతజడ పూలు వంటి వాటిని పిరమిడ్ ఆకారంలో వరుసలుగా పేర్చుతారు. గుమ్మడి పువ్వులోని మధ్య భాగాన్ని గౌరమ్మగా భావిస్తారు. దీనిని బతుకమ్మ పైభాగం మధ్యలో పెడతారు. పూలతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మనూ ఉంచుతారు. అనంతరం ఇంటి ముందు ఉంచి, ఆ తర్వాత కాలనీలోని ఒకచోటకు చేర్చి అంతా కలిసి బతుకమ్మ ఆడతారు. అనంతరం సమీపంలోని చెరువులోగాని కుంటలోగాని నిమజ్జనం చేస్తారు. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ(Batukamma) ఆడతారు. తొలిరోజు నిర్వహించే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు.
Batukamma | పురాణ గాథ..
బతుకమ్మ పండుగ మొదట జానపదుల పండుగగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెలంగాణ అంతటా వ్యాపించింది. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి. ఈ పండుగ వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం కైలాసనాథుడు గంగ(Ganga)ను తన శిరసున దాల్చడంతో.. అందరూ ఆమెనే పూజిస్తున్నారంటూ పార్వతీదేవి(Parvati Devi) అలక వహించిందట. అప్పుడు గంగమ్మ ఆమెను ఓదార్చిందట. గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలిపోతూ ఉన్నప్పుడు పూజించేలా చేస్తానని మాట ఇచ్చిందట. అందుకే అప్పటి నుంచి ఏటా పూల బతుకమ్మగా మారిందని తెలుస్తోంది.
Batukamma | ఏ రోజున ఏ బతుకమ్మ అంటే?
21 : ఎంగిలి పూల బతుకమ్మ.
22 : అటుకుల బతుకమ్మ.
23 : ముద్దపప్పు బతుకమ్మ.
24 : నానబియ్యం బతుకమ్మ.
25 : అట్ల బతుకమ్మ.
26 : అలిగిన బతుకమ్మ. (ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి, బతుకమ్మ ఆట ఆడరు.)
27 : వేపకాయల బతుకమ్మ.
28 : వెన్నముద్దల బతుకమ్మ.
29, 30 : సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ.