అక్షరటుడే, వెబ్‌డెస్క్:Chardham Yatra | ప్రతి హిందువు ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర చార్‌ధామ్. నాలుగు ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించాలన్నది ప్రతి ఒక్కరి కల. ఏటా మేలో ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం ఎంతో మంది భక్తులు ఏడాదంతా వేచి చూస్తుంటారు. ఈ సంవత్సరం కూడా కేదార్‌నాథ్(Kedarnath), బద్రీనాథ్(Badrinath), గంగోత్రి(Gangotri), యమునోత్రి(Yamunotri) క్షేత్రాలను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయ నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. గతేడాది 48 లక్షల మంది చార్‌ధామ్ యాత్ర చేయగా, ఈసారి ఆ సంఖ్య 60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.
ఏప్రిల్ 30 నుంచి యమునోత్రి, గంగోత్రి తెరచుకోనుండగా, మే 2 నుంచి కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోనుంది. మే 4వ తేదీ నుంచి బద్రీనాథ్ క్షేత్రం భక్తుల సందర్శనకు అందుబాటులోకి రానుంది.
Chardham Yatra | యమునోత్రితో యాత్ర మొదలు..
చార్‌ధామ్ యాత్ర ప్రధానంగా యమునోత్రి(Yamunotri) సందర్శనతో మొదలవుతంది. ఇక్కడి యమునా నదిలో స్నానం చేసి శైవ క్షేత్రాల సందర్శనను ప్రారంభిస్తారు. ఈ నదిలో పుణ్యస్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం యమునాదేవిని సందర్శించుకుంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే ఆరు కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది.
Chardham Yatra | గంగోత్రి సందర్శన
చార్‌ధామ్ యాత్రలో సందర్శించే రెండో పుణ్యక్షేత్రం గంగోత్రి(Gangotri). ఈ ఆలయం సముద్ర మట్టానికి 3,048 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గంగానదిలో స్నానం చేసిన అనంతరం గంగాదేవికి అంకితమైన ఈ ఆలయం సందర్శించుకుంటారు.
Chardham Yatra | కేదార్‌నాథ్
దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేసవిలో మాత్రమే తెరుస్తారు. హిమాలయాల్లో కొలువుదీరిన ఈ ఆలయాన్ని మిగతా కాలమంతా మంచు కురుస్తుందని మూసివేస్తారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ఆలయాన్ని మే 2వ తేదీన తెరువనున్నారు. మిగతా రోజుల్లో స్వామి విగ్రహాన్ని ఉఖిమత్(Ukhimath)లో ఉంచుతారు. ప్రస్తుతం ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో శివుని విగ్రహాన్ని సోమవారం ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి తీసుకెళ్లారు. గర్హ్వాల్ హిమాలయాలలోని కేదార్‌నాథ్(Kedarnath) మందిరానికి చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. గుప్త్ కాశి, ఫాటా, గౌరికుండ్‌లలో రాత్రిపూట ఆగిన తర్వాత ఇది మే 1న కేదార్‌నాథ్ చేరుకోనున్నారు.
Chardham Yatra | బద్రీనాథ్..
చార్‌ధామ్ యాత్రలో చివరి ఆలయ సందర్శన ఇదే. విష్ణువు బద్రినారాయణ(Vishnu Badrinarayana) రూపంలో ఇక్కడ కొలువుదీరారని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయంలో వేదయుగం నాటి 3.3 అడుగుల ఎత్తయిన నల్లరాతి విగ్రహం ఉంది. తొమ్మిదో శతాబ్ధంలో ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ, గర్భగుడిని మాత్రం అలాగే ఉంచారు. మే 4వ తేదీన తెరుచుకోనున్న ఆలయాన్ని ఈసారి 60 లక్షల మంది దాకా దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. అందుకోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం(Uttarakhand Government) అన్ని ఏర్పాట్లు చేస్తోంది.