అక్షరటుడే, కామారెడ్డి: Tiger | రామారెడ్డి (Ramareddy) మండలం గోకుల్ తండాలో (Gokul Thanda) పెద్దపులి సంచారం వార్తలపై అటవీ శాఖ అధికారులు (Forest Department) స్పందించారు. ఆవుపై దాడి చేసింది పెద్దపులి కాదని.. చిరుత అని తేల్చారు.
ఈ మేరకు ఆవు కోసం తిరిగి వచ్చి ట్రాక్ కెమెరా (Track camera)కు చిక్కిన ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. అలాగే దాడి చేసింది ఆవుపై కాదని, లేగ దూడపై అని వివరించారు. శుక్రవారం లేగ దూడకు పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు వైకుంఠ దామం (Vaikunta Damam) పక్కనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
Tiger | ఆవుల మందపై దాడి..
గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిరుత పులి వచ్చి ఆవుల మందపై దాడిచేసి లేగ దూడను చంపేసింది. ఆవుల మంద వద్దనే ఉన్న బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో లేగదూడను తినకుండానే చిరుత పారిపోయింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబసభ్యులు అధికారులకు తెలపడంతో అటవీ అధికారులు వచ్చి ఆవుల మందను ఇతర చోటకు తరలించి లేగ దూడను అక్కడే ఉంచి ట్రాక్ కెమెరాలను అమర్చారు.
Tiger | రాత్రి మరోసారి వచ్చిన పులి..
రాత్రి మరోసారి వచ్చిన చిరుతపులి లేగ దూడను లాక్కెళ్లి 70 శాతం తినేసి కళేబరాన్ని వైకుంఠ దామంకు కొద్దిదూరంలో వదిలేసి వెళ్లిపోయింది. ఉదయం ఫారెస్ట్ అధికారులు ట్రాక్ కెమెరా చెక్ చేయగా లేగ దూడను లాక్కెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో లేగ దూడపై దాడి చేసింది చిరుత పులి అని, పెద్దపులి కాదని నిర్దారించుకున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Tiger | జాడ కోసం 26 ట్రాక్ కెమెరాలు
మరోవైపు రెడ్డిపేట స్కూల్ తండా అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. వారం రోజులుగా అధికారులు పెద్దపులి జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. నాలుగు బృందాలు పులి వేటలో నిమగ్నమై ఉన్నాయి. మెదటి రోజు పులి జాడ కనుక్కునేందుకు 6 ట్రాక్ కెమెరాలు అమర్చారు. ప్రస్తుతం వాటి సంఖ్యను పెంచారు. శివారు అటవీ ప్రాంతంలో మొత్తం 26 ట్రాక్ కెమెరాలు అమర్చినట్టు అధికారులు తెలిపారు.