అక్షరటుడే, వెబ్‌డెస్క్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జియోఫైనాన్స్ యాప్, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లింపులు, రుణాలు, బీమాతో సహా అనేక రకాల డిజిటల్ ఆర్థిక సేవలను (Financial Services) అందిస్తున్న సంస్థ తాజాగా ఐటీఆర్ (ITR) చెల్లింపు ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది.
తమ యాప్ ద్వారా సులభంగా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. ముకేశ్ అంబానికి చెందిన ఈ కంపెనీ గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధంగా ఉండేది. 2023లో దీనిని సెపరేట్ చేయగా.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతోంది. తాజాగా జియో (JIO) ఫైనాన్స్ ఐటీఆర్ ఫైలింగ్ ఫీచర్‌ను ప్రారంభించింది.
ITR Filing | తక్కువ ధరకే..
ప్రస్తుతం ఐటీఆర్ ఫైలింగ్ కోసం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నేరుగా ఐటీ వెబ్సైట్ నుంచి ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉన్న చాలా మందికి అర్థం కాక సీఏలను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటికే పలు కంపెనీలు ఆన్లైన్లో ఐటీఆర్ ఫైల్ చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చాయి. అయితే ఆయా కంపెనీలు భారీగా డబ్బులు ఛార్జీ చేస్తుండగా.. జియో ఫైనాన్స్ తక్కువ ధరకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సొంతంగా ఐటీఆర్ ఫైల్ (Self ITR Filing) చేసుకునే ప్లాన్ రూ.24 నుంచి ప్రారంభం అవుతుంది. నిపుణుల సాయం కావాలంటే మాత్రం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.
ITR Filing | సులువుగా ఐటీఆర్ ఫైలింగ్
జియో ఫైనాన్స్ టాక్స్ బడ్డీ (TAX Buddy) భాగస్వామ్యంతో ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టింది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలును సరళీకృతం చేయడానికి, పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంచుకోవడానికి వినియోగదారులకు సాయ పడటానికి ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. పన్ను దాఖలు – ఆదాయ వివరాలను నమోదు, పత్రాలను అప్‌లోడ్ చేయడానికి, తగిన విధానాన్ని ఎంచుకోవడానికి నిపుణుల సాయాన్ని కూడా అందించనుంది. ఐటీఆర్ ఫైల్ చేశాక రిటర్న్ స్టేటస్, రీఫండ్‌లను ట్రాక్ చేసే వెసులుబాటు కూడా ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఇతర సంస్థలు ఐటీఆర్ సొంతంగా ఫైల్ చేసుకోవడానికి రూ.199 నుంచి రూ.499 వరకు వసూలు చేస్తున్నాయి. నిపుణుల సాయంతో దాఖలు చేయడానికి రూ.799 నుంచి రూ.2 వేరకు ఛార్జీ చేస్తున్నాయి. ఈ క్రమంలో జియో ఫైనాన్స్ రూ.24కే సొంతంగా, రూ.999కి నిపుణుల సాయంతో ఐటీఆర్ ఫైల్ చేసే సౌకర్యం తీసుకు వచ్చింది. దీంతో చాలా మంది ఇటువైపు మళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
