అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IT Raids | తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు(IT Officers) దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి పలువురు వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని 25 చోట్ల అధికారులు తనిఖీలు చేశారు. రూ.300కోట్ల దాల్ ట్రేడ్ కేసులో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో పలు కంపెనీలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. 2024 ఎన్నికల సమయంలోనూ భారీగా నగదు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు.
IT Raids | పప్పు దినుసుల వ్యాపారుల ఇళ్లలో..
పలు కంపెనీలు పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతులు పొంది పప్పు దినుసులు సరఫరా చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఐటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో పప్పుదినుసుల హోల్‌సేల్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేపడుతున్నారు. గతంలో విశాఖపట్నంలో హిందుస్థాన్ ట్రేడర్స్, కర్నూలుల వీకేర్ గ్రూప్‌లో సైతం అధికారులు తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్(Hyderabad)లోని కొండాపూర్ అపర్ణ హోమ్స్‌లో నివసించే వెంకట్‌రెడ్డి ఇంట్లో సైతం అధికారులు సోదాలు చేపట్టారు. కూకట్పల్లి ప్రాంతాలో సైతం తనిఖీలు నిర్వహించారు.
IT Raids | గతంలో సైతం..
గత నెలలో సైతం ఐటీ అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. హైదరాబాద్ నగరంతో పాటు, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో తనిఖీలు చేశారు. బంగారు దుకాణాల వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేశారు. బంగారం కొనుగోలు పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు.