అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (Global Capability Centers) హబ్‌గా మార్చామని తెలిపారు. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy | తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతాం
పారిశ్రామిక అభివృద్ధి సహా అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఆ దిశగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ జీసీసీ హబ్‌గా (Hyderabad GCC Hub) ఎదగడం ఒక నిదర్శనమని చెప్పారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులను రేవంత్‌రెడ్డి అభినందించారు.
CM Revanth Reddy | మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఎలీ లిల్లీ వంటి ప్రపంచ స్థాయి సంస్థ హైదరాబాద్‌కు రావడం గర్వకారణమన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 200 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. మధుమేహం, క్యాన్సర్, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ వంటి రంగాల్లో ఎలీ లిల్లీ చేసే కృషి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎలీ లిల్లీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డియాగో రావు, ఇండియా ప్రెసిడెంట్ విన్సెలోవ్ టకర్, మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ అరోరా పాల్గొన్నారు.
లిల్లీ బ్రాండ్ పేరుతో..
అమెరికాకు చెందిన ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly Company) లిల్లీ బ్రాండ్ పేరుతో వ్యాపారం చేస్తోంది. ఇండియానాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ ఫార్మా కంపెనీకి 18 దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి. ఈ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు దాదాపు 125 దేశాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఫార్మా కంపెనీగా పేరున్న ఎలి లిల్లీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌లో ఇది రెండో క్యాపబిలిటీ సెంటర్ కావడం గమనార్హం. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.