అక్షరటుడే, హైదరాబాద్: IT company : గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధి గచ్చిబౌలి(Gachibowli)లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిర్వాహకులు ఉద్యోగాల పేరుతో 200 మంది నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి పారిపోయారు. ఈ మేరకు బాధితులు ఆప్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాదాపూర్(Madhapur) లో కొందరు కలిసి కొన్ని నెలల కింద స్కిల్ హబ్ కన్సల్టెన్సీ(Skill Hub Consultancy) ఏర్పాటు చేశారు. జాబ్ పోర్టళ్లలో కొలువుల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులనే టార్గెట్ చేశారు. వారికి ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారు.
ప్యాకేజీల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షల వసూలు చేశారు. ఇలా వీరి మర్మం తెలియని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 200 మంది రూ.5 కోట్ల వరకు ఇచ్చుకున్నారు. తదుపరి ప్రణాళిక ప్రకారం.. గచ్చిబౌలి ప్లాటినం బిల్డింగ్ తొమ్మిదో అంతస్తులో ఉన్న వ్యూరోపోల్ క్రియేటివ్స్ అండ్ ఐటీ సొల్యూషన్(Veuropol Creatives and IT Solution) లో ఉద్యోగాలు కల్పించారు. మూడు నెలల శిక్షణ తర్వాత పర్మినెంట్ చేస్తామన్నారు. ఇందుకోసం ఏడాది బాండ్ కూడా రాయించుకున్నారు. రెండు నెలల శిక్షణ ముగిశాక కొందరికి వేతనాలు ఇచ్చారు.
కాగా, మే 7న రోజూ మాదిరిగా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు తాళం వేసి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అర్థం కాక సెక్యూరిటీని అగిడితే ఆ కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు వారు వివరణ ఇచ్చారు. చివరికి మోసపోయామని గుర్తించిన నిరుద్యోగులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.