HomeతెలంగాణMaganti Sunitha | సునీత మాగంటి గోపినాథ్​ భార్య కాదా.. నామినేషన్​లో ట్విస్ట్​!

Maganti Sunitha | సునీత మాగంటి గోపినాథ్​ భార్య కాదా.. నామినేషన్​లో ట్విస్ట్​!

Maganti Sunitha | బీఆర్​ఎస్​ అభ్యర్థి సునీత, మాగంటి గోపినాథ్​ భార్య కాదని ఓ వ్యక్తి ఆరోపించారు. ఆమె నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maganti Sunitha | జూబ్లీహిల్స్​ (Jubilee Hills) ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్​ మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తన అభ్యర్థిగా ఆయన భార్య మాగంటి సునీతను ప్రకటించగా.. ఆమె నామినేషన్​ కూడా వేశారు. ఇక్కడే ట్విస్ట్​ చేసుకుంది. ఆమె గోపినాథ్​ భార్య కాదని ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశాడు.

జూబ్లీహిల్స్​ బీఆర్​ఎస్​ అభ్యర్థిగా సునీత నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం వాటిని పరిశీలించిన అధికారులు ఆమోదించారు. అయితే సునీత గోపినాథ్​ భార్య కాదంటూ.. తారక్ ప్రద్యుమ్న (Tarak Pradyumna) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. గోపినాథ్​ అసలు వారసుడిని తానే అంటూ అతడు ప్రకటించడం గమనార్హం. గోపీనాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక వారసుడిని తానేనని ఆయన ప్రకటించాడు.

Maganti Sunitha | ఆమెను పెళ్లి చేసుకోలేదు..

తన తండ్రి గోపినాథ్​ సునీతను వివాహం చేసుకోలేదని ప్రద్యుమ్న ఆరోపించారు. గోపీనాథ్, సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉన్నారని చెప్పారు. తన తల్లి మాలినీ దేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని పేర్కొన్నారు. వివాహం చేసుకోకుండా అఫిడవిట్‌లో తన భర్త అంటూ గోపినాథ్ పేరును సునీత ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్‌ను పొందారని ఆరోపించారు. సునీతకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అక్టోబర్ 11న ఆర్డీవో రద్దు చేశారని ఆయన తెలిపారు. సునీత నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన కోరారు.

Maganti Sunitha | బీఆర్​ఎస్​కు ముందే తెలుసా

మాగంటి సునీత కుటుంబంలో వివాదాలు ఉన్నట్లు బీఆర్​ఎస్ (BRS)​కు ముందే తెలుసనే ప్రచారం జరుగుతోంది. అందుకే బీఆర్​ఎస్​ తరఫున డమ్మీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డితో నామినేషన్​ వేయించినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్​ టికెట్​ను విష్ణువర్ధన్​రెడ్డి సైతం ఆశించారు. అయితే గోపినాథ్​ సతీమణి వైపు బీఆర్​ఎస్​ మొగ్గు చూపింది. అయితే ఆమె నామినేషన్​ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తలెత్తకుండా విష్ణువర్ధన్​రెడ్డితో నామినేషన్​ వేయించడం గమనార్హం. దీంతో ఆ వివాదం గురించి బీఆర్​ఎస్​ నాయకులకు ముందే తెలుసని, ఒకవేళ ఈసీ నామినేషన్​ తిరస్కరిస్తే పీవీఆర్​ను బరిలోకి దింపడానికి ముందుగానే ప్లాన్​ చేశారనే ప్రచారం జరుగుతోంది.

Maganti Sunitha | ఈసీ ఏం చేస్తుంది

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. మాగంటి సునీత దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్లను పరిశీలించిన అధికారులు వాటిని ఆమోదించారు. అయితే తాజాగా మాగంటి గోపినాథ్​ కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్​ ప్రద్యుమ్నా ఫిర్యాదుతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.