IPL 2025 | ఇషాన్ కిషన్ ఔట్ వివాదం.. అప్పీల్ చేయకుండానే అంపైర్ ఔటిచ్చాడా?
IPL 2025 | ఇషాన్ కిషన్ ఔట్ వివాదం.. అప్పీల్ చేయకుండానే అంపైర్ ఔటిచ్చాడా?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఔట్(Ishan Kishan Out) తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయం ప్రకటించక ముందే ఇషాన్ కిషన్‌ పెవిలియన్ బాట పట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు వైడ్ ఇచ్చేందుకు సిద్దమైన అంపైర్.. ఇషాన్ కిషన్ వెనుదిరగడం చూసి నిర్ణయం మార్చుకొని ఔటిచ్చాడు. తీరా రిప్లేలో ఇది నాటౌట్‌గా తేలింది. దీపక్ చాహర్(Deepak Chahar) వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నంలో ఇషాన్ కిషన్ కీపర్ క్యాచ్‌గా ఔటైనట్లు భ్రమ పడి మైదానాన్ని వీడాడు.

ఈ ఘటనపై సోషల్ మీడియా(Social Media) వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. ఇషాన్ కిషన్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, ముంబై జట్టుకు ఫేవర్‌గా మైదానం వీడాడని విమర్శలు వచ్చాయి. మరోవైపు ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆటగాళ్లు అప్పీల్ చేయకుండా ఫీల్డ్ అంపైర్ వినోద్ ఔట్? ఎలా ఇచ్చాడని నెటిజన్లు ప్రశ్నించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను ఫిక్స్(Match fixing) చేశారని మండిపడుతున్నారు. అయితే అప్పీల్ చేయకుండానే అంపైర్(Umpire) ఔటిచ్చాడనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ముంబై బౌలర్ దీపక్ చాహర్, వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ అప్పీల్ చేయకున్నా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అప్పీల్ చేశాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ చూస్తే ఈ విషయం తెలుస్తోంది.

ఔటివ్వకుండా ఇషాన్ కిషన్ వెనుదిరగడం వెనుక కూడా ఎలాంటి కుట్ర లేదు. ఔటయ్యాననే భ్రమ పడే ఇషాన్ కిషన్ మైదానం వీడాడు. క్రీడా స్ఫూర్తిని చాటాలనే అత్యుత్సాహంతోనే ఈ తప్పిదం చేశాడు. అంతే తప్పా.. అభిమానులు ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. ఈ మ్యాచ్ హైలైట్స్‌(Match Highlights)ను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.