అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రజలను ప్రభుత్వం భయపెడుతుందన్నారు.
ఇండ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
KTR | హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని కేటీఆర్ విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. ఒక్కరికైనా ఇచ్చిండ్రా? అని ప్రశ్నించారు. కేసీఆర్(KCR) ఉన్నప్పుడు రైతుబంధు టింగు టింగుమని పడుతుండే. ఇప్పుడు వస్తున్నాయా? అని నిలదీశారు. కేసీఆర్ రూ.2 వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు.. అత్తకు, కోడలుకు ఇద్దరికీ పింఛన్ ఇస్తానని చెప్పండి. పెన్షన్ పెంచకుండా, కొత్తవి ఇవ్వకుండా ఎత్తేసిండని మండిపడ్డారు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేశామని గుర్తు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ అమలు చేయలేక చేతులెత్తేసిందన్నారు. పైగా రెండు నెలలు పాటు ముసలోళ్ల పింఛన్లు ఎగ్గొట్టిండ్రు. రైతుబంధు ఎగ్గొట్టిండ్రు అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పింఛన్లు ఇవ్వకుండా అత్తాకోడళ్ల మధ్య పంచాయితీ పెట్టిండని విమర్శించారు.
KTR | కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇస్తే ఇళ్లు కూల్చేస్తారు
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టుడా? ఒక్కో రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే కూల్చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. హైడ్రా(Hydraa) పేరిట ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఓటు కాంగ్రెస్‌కు వేసినా మీ ఇల్లు కూలగొట్టుకోవడానికే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు. హైడ్రా పెద్ద పెద్దవాళ్ల ఇండ్ల మీదుకు పోదు. పేదల ఇండ్లమీదకే హైడ్రా బుల్డోజర్లు వెళ్తాయన్నారు. గండిపేట్ ఎఫ్‌టీఎల్ పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు కట్టుకున్న ఇంటి మీదికి హైడ్రా ఎందుకు పోదని నిలదీశారు.
KTR | ఉప ఎన్నికలో గెలవాల్సిందే..
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పైసలు పంచి గెలుస్తామన్న కాంగ్రెస్ నాయకులు ధీమాతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఒక్కో ఓటు కీలకమని, కాంగ్రెస్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి మాగంటి గోపినాథ్ చేసిన సేవలు గుర్తు చేస్తూ ఓట్లు అడగాలని సూచించారు. యుద్ధంలా కొట్లాడితేనే విజయం సాధిస్తామని చెప్పారు. అధికారంలో ఉన్న వాళ్లు అన్ని రకాలుగా ప్రలోభపెడతారని, వారిని మనం దీటుగా ఎదుర్కోవాలని సూచించారు.