HomeజాతీయంMaoist Hidma | హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధం అయ్యాడా.. వెలుగులోకి కీలక లేఖ

Maoist Hidma | హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధం అయ్యాడా.. వెలుగులోకి కీలక లేఖ

మావోయిస్ట్​ కీలక నేత హిడ్మా ఎన్​కౌంటర్​లో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే నవంబర్​ 10న ఆయన ఓ జర్నలిస్ట్​కు రాసిన లేఖ తాజాగా బయటకు వచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Hidma | మావోయిస్ట్​ కీలక నేత, అనేక దాడులకు వ్యూహరచన చేసిన మాడ్వి హిడ్మా మంగళవారం ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా (Madvi Hidma)తో పాటు ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే తాజాగా ఓ జర్నలిస్ట్​కు రాసిన లేఖ బయటకు వచ్చింది.

ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని బస్తర్‌ ప్రాంతానికి చెందిన ఒక జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాశారు. తన ఆలోచనలు, నిర్ణయాలపై నవంబర్‌ 10న లేఖ రాయగా.. తాజాగా అది బయటకు వచ్చింది. ఏపీకి రావాలని ఆ లేఖలో హిడ్మా జర్నలిస్ట్​కు సూచించారు. తాము ఆయుధాలు వీడే అవకాశం ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. భద్రత కల్పిస్తే తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీనిపై త్వరలోనే హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని లేఖలో రాశాడు. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. కాగా ఆయన లొంగిపోకముందే ఎన్​కౌంటర్​లో మృతి చెందడం గమనార్హం.

Maoist Hidma | ఉద్యమం అయిపోయినట్టేనా..

దేశంలో మావోయిస్ట్​ ఉద్యమం ఇక ముగిసిపోయినట్లేనని పలువురు విశ్లేషకులు అంటున్నారు. నంబాల కేశవరావు ఉన్నప్పుడే తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధం అయినట్లు గతంలో మల్లోజుల వేణుగోపాల్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన లేఖతో మావోయిస్ట్​ పార్టీలో చీలికలు బయట పడ్డాయి. దీంతో మల్లోజుల 61 మందితో కలిసి లొంగిపోయాడు. అనంతరం మరో కీలక నేత ఆశన్న సైతం 208 మంది అనుచరులతో ఛత్తీస్​గఢ్​ సీఎం (Chhattisgarh CM) ఎదుట సరెండర్​ అయ్యాడు. తాజాగా హిడ్మా కూడా లొంగిపోయేందుకు సిద్ధం అయ్యాడని లేఖ బయటకు రావడంతో.. మావోయిస్ట్​ పార్టీ (Maoist Party) శకం ముగిసినట్లేనని పలువురు అంటున్నారు.

ప్రస్తుతం పార్టీ కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. కీలకమైన నేతలు ఎన్​కౌంటర్లలో చనిపోయారు. పలువురు లొంగిపోయారు. ఎంతో భద్రత ఉండే హిడ్మాను సైతం బలగాలు మట్టుబెట్టాయి. దీంతో రానున్న రోజుల్లో మిగతా వారిని సులువుగానే పట్టుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో చాలా మంది లొంగిపోయే ఛాన్స్​ ఉంది. కేంద్ర ప్రభుత్వం (Central Government) 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. అయితే ఆ లోపే ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.