అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Danam Nagender | ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయనున్నారా? అనర్హత వేటు పడే అవకాశమున్న తరుణంలో ఆయనే స్వచ్ఛందంగా పదవిని వదులుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసయనీయంగా తెలిసింది. సోమవారం సాయంత్రం ఆయన రాజీనామాను ప్రకటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్ (Party High Command) సూచనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
MLA Danam Nagender | బీఆర్ఎస్ నుంచి గెలిచి..
హైదరాబాద్ మహానగరంలో బలమున్న నాయకుడు దానం నాగేందర్ (MLA Danam Nagender). బీసీ సామాజికవర్గానికి చెందిన తను.. దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి తన పట్టు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ తరఫున పలుమార్లు గెలిచి మంత్రిగా అయ్యారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన వరుస విజయాలు సాధించారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అనూహ్యంగా గెలిచింది. ఖైరతాబాద్ నుంచి మరోసారి గెలుపొందిన దానం నాగేందర్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
MLA Danam Nagender | ఫిరాయింపులపై విచారణ..
బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హత వేట వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. సభాపతి ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఫిరాయింపు ఫిర్యాదులపై జాప్యం చేస్తుండడాన్ని ఆక్షేపించింది. నెలల తరబడి జాప్యం చేయడాన్ని తప్పుబట్టిన కోర్టు.. మూడు నెలల్లోపు ఫిర్యాదులను పరిష్కరించాలని సభాపతికి గడువు నిర్దేశించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రారంభించారు.
MLA Danam Nagender | వేటు తప్పించుకునేందుకేనా?
అయితే, మిగతా ఎమ్మెల్యేలు తప్పించుకునే అవకాశమున్నా దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన ఆయన.. గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ ఫిరాయించి, అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తరుణంలో ఆయనకు అనర్హత గండం నుంచి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అనర్హత వేటు పడితే ఆరేళ్ల వరకు పోటీ చేసే అవకాశం దక్కదు. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదించిన అనంతరం దానం నాగేందర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. నేడో, రేపో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించి, స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని అందించనున్నట్లు తెలిసింది. తన రాజీనామాతో ఖాళీ కానున్న స్థానంలో మరోసారి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.