అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ ధిక్కార స్వరం వినిపించడం నుంచి మొదలు సస్పెండ్ చేయడం దాకా మీడియాతో పాటు సామాన్యుల దృష్టి కూడా ఆమెపైనే నెలకొంది. అయితే, కవిత ఉదంతం తర్వాత ఇప్పుడు మరో కీలక అంశం చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లో ఆడబిడ్డలను కాదని, కొడుకులకే వారసత్వం అప్పగిస్తుండడంపై ఆసక్తికర్త చర్చ జరుగుతోంది. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఆడబిడ్డలకు అధికారం దక్కని అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. పురుషాధిక్యత కలిగిన మన దేశంలో రాజకీయాల్లోనూ మొదటి నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోంది. కనిమొళి, సూప్రియా సూలే నుంచి మొదలుకుని వైఎస్ షర్మిల.. తాజాగా కవిత(MLC Kavitha) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న వీరికి పార్టీలోనూ, అధికారంలోనూ వాటా దక్కక పోవడం గమనార్హం. ఇక, పార్టీ కోసం సర్వం ధారపోసిన షర్మిల, కవిత వంటి వారిని ఏకంగా బయటరే వెళ్లగొట్టడం మరింత దారుణం.
MLC Kavitha | ఉదాహరణలెన్నో..
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మహిళలకు అధికారం దక్కడం లేదు. పురుషాధిక్యత కలిగిన మన దేశంలో మొదటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఒక్క ఇందిరాగాంధీ మినహా జాతీయ స్థాయిలో ఎదిగిన వారు ఎవరూ లేకపోవడం ఆడవారి పట్ల కొనసాగుతున్న వివక్షకు నిదర్శనం. మాయావతి, మమతాబెనర్జీ లాంటి వారు సొంతంగా ఎదిగిన నేతలు మినహా మిగతా వారెవరికీ అధికారం దక్కలేదు. ఇందిరాగాంధీ కూడా సోదర పోరు లేకపోవడంతో ఆమె పాలిటిక్స్‌లో రావడం, దేశాన్ని ఏలే భాగ్యం దక్కింది. లేకపోతే ఆమెకు తోడబుట్టిన సోదరుడు ఉంటే ఇందిర కూడా ఇంటికే పరిమితమయ్యే వారు. ఇక, ఇద్దరు మహిళలు రాష్ట్రపతిగా, పలువురు అతివలు గవర్నర్లుగా, స్పీకర్లుగా, మంత్రులుగా పని చేసినా, చేస్తున్నా వారి అధికారం పరిమితమనేది అందరికీ తెలిసిందే. పేరుకే పెద్ద పదవి.. అధికారమంతా కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రుల చేతుల్లోనే ఉండేది. రబ్రీదేవి వంటి వారికి చాన్స్ దొరికినా తెర వెనుక ఉండి నడిపించిందంతా లాలూ ప్రసాద్ యాదవే కదా.
MLC Kavitha | ఆడబిడ్డలుగా పుట్టడమే తప్పా..?
దేశ రాజకీయాల్లో ఎంతో మంది మహిళలు రాజకీయాల్లో విశేషంగా రాణించారు. రాణిస్తున్నారు కూడా. కానీ పురుషాధిక్య సమాజంలో వారికి స్వతంత్రంగా పని చేసే పరిస్థితులు దొరకడం లేదు. వారు ఆడబిడ్డలుగా పుట్టడమే వారు చేసుకున్న తప్పిదం. ఇందుకు తాజాగా కవిత నుంచి మొదలు ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కనున్న మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటిని వదిలి బయటకు వచ్చిన కవిత దాదాపు రెండు దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉన్నారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)లో ఆమె తనదైన ముద్ర వేశారు. బతుకమ్మలు, బోనాల పండుగతో ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో, మహిళల భాగస్వామ్యం పెంచడంలో విశేష కృషి చేశారు.
రాజకీయ ఆకాంక్షలు కలిగి ఉన్న ఆమెకు వారసత్వ పోరు తప్పలేదు. ఆధిపత్య పోరులో ఆమెకు భంగపాటు తప్పలేదు. ఇక, వైఎస్ షర్మిల(YS Sharmila)ది కూడా అదే పరిస్థితి. తండ్రి చనిపోయిన తర్వాత అన్న జగన్ వేరు కుంపటి పెడితే వెంట నిలిచింది. సోదరుడ్ని జైలుకు పంపితే పార్టీని భుజాన మోసింది. అన్న ఇచ్చిన మాట కోసం వేల కిలోమీటర్లు తిరిగింది. కానీ చివరికి అధికారం కాదు కదా.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా దక్కలేదు. ఇక, తమిళనాట కనిమొళి కానీ, మహారాష్ట్రలో సుప్రియా సూలేది కూడా దాదాపు అదే పరిస్థితి. రాష్ట్రంలోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ వీళ్లు రాణిస్తున్నా, తోడబుట్టిన వారి వల్లో, కుటుంబ సభ్యుల కారణంగానో అధికారం దక్కే పరిస్థితి లేదు. అంతెందుకు ఓల్డ్ గ్రాండ్ పార్టీ కాంగ్రెస్ లో కూడా ఇదే ఒరవడి ఉంది కదా. దివంగత రాజీవ్‌గాంధీ వారసుడిగా రాహుల్‌గాంధీ మాత్రమే తెరపైకి వచ్చారు. ఎన్ని వైఫల్యాలు, ఓటములు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ(Congress Party) దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఆయననే ప్రమోట్ చేస్తూ వస్తోంది. ప్రియాంకగాంధీ ఇప్పుడిప్పుడే తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోక వస్తే, ఆమెకు అధికారం దక్కుతుందా? అంటే నమ్మకం లేదు. ఇటలీలో పుట్టి పెరిగిన సోనియాగాంధీ కొడుకు ఉండగా బిడ్డను ప్రధాని చేస్తుందా? అంటే ఎవరూ నమ్మరు. ఈ విషయాన్ని ఏ కాంగ్రెస్ నాయకుడిని అడిగినా రాహుల్‌గాంధే మా నేత, ఆయనే భావి ప్రధాని అని చెబుతారు.
MLC Kavitha | పేరుకే అతివలకు అధికారం..
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు రాణిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారని అంతా చాలా గొప్పగా చెబుతారు. కానీ వాస్తవికంగా వారి దక్కుతున్నది, దక్కేది ఏమిటో తీక్షణంగా పరిశీలిస్తే కానీ అంతు చిక్కదు. పేరుకు మాత్రమే అతివలు రాణిస్తున్నారు.. చరిత్ర లిఖిస్తున్నారని చెప్పడం తప్పతే వాస్తవానికి వారికి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఒకరిద్దరికీ చాన్స్ దొరికినా వెనుకుండి నడిపించేది భర్తనో, తండ్రో, తమ్ముడో అన్ననో తప్పితే అతివలు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితే లేదు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి మొదలు రాష్ట్రపతి దాకా కీలుబొమ్మలుగా మారడం మినహా వారికి నిజంగా అధికారం దక్కిందయితే లేదు. దేశానికి స్వాతంత్య్ర వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా మన దేశ ఆడబిడ్డలకు ఇంకా స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాకపోవడం వైచిత్రి.