అక్షరటుడే, వెబ్‌డెస్క్: America – Iran | అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్లో ఆందోళనలను సాకుగా చూపి ఆ దేశంపై దాడికి అగ్రరాజ్యం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన యుద్ధనౌకలను ఇరాన్ సమీపంలోకి పంపించింది.
విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ (Abraham Lincoln), అనేక గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్లు రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యానికి చేరుకుంటాయని అమెరికన్ అధికారులు తెలిపారు. ట్రంప్ సైతం ఇరాన్ దిశగా భారీగా అమెరికా యుద్ధనౌకలు కదులుతున్నట్లు ప్రకటించారు. దావోస్ పర్యటన (Davos Trip) ముగించుకొని అమెరికా వెళ్తుండగా.. ట్రంప్ (Donald Trump) ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వైపుగా భారీ సైన్యం వెళ్తోందని, ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అయితే సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో ఇరాన్– అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు టెహ్రాన్‌కు ప్రత్యక్ష బెదిరింపు జారీ చేశారు. ఖమేనీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందేమోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది.
America – Iran | అమెరికా కీలక చర్యలు
అమెరికా మధ్యప్రాచ్యంలోని వైమానిక స్థావరాలలో పేట్రియాట్, THAAD (టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) క్షిపణి రక్షణ వ్యవస్థలతో సహా దీర్ఘ-శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించాలని నిర్ణయించింది. ఇరాన్లో కొంతకాలంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. వాటిని ఖమేని ప్రభుత్వం అణచివేస్తోంది. అయితే ఆందోళనకారులకు అమెరికా మద్దతు తెలుపుతోంది. ఖమేని (Khamenei) గద్దె దిగిపోవాలని ట్రంప్ గతంలో వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ దేశంపై దాడికి సైతం సిద్ధమని ప్రకటించారు. అయితే తమ దేశంపై దాడి చేస్తూ ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో అగ్రరాజ్యం అప్రమత్తమై రక్షణ వ్యవస్థలను మోహరిస్తోంది.
America – Iran | ఒత్తిడి పెంచే వ్యూహం
అమెరికా సీనియర్ అధికారులు ఈ మోహరింపులు అమెరికా స్థావరాలను రక్షించడానికి మాత్రమే కాకుండా, ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి అని పేర్కొంటున్నారు. ఇరాన్ ఇటీవలి నిరసనలను క్రూరంగా అణచివేసిందని అమెరికా ఆరోపించింది, దీని ఫలితంగా సుమారు 18 వేల మంది మరణించారని చెబుతోంది. దీంతో సైన్యం, యుద్ధ నౌకలను మోహరించడంతో ఖమేని ప్రభుత్వం (Khamenei Government) వెనక్కి తగ్గుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. పేట్రియాట్, థాడ్ వ్యవస్థలను మోహరించడం ద్వారా, అమెరికా ఇరాన్ ప్రతీకార దాడుల ప్రమాదాన్ని తగ్గించాలని చూస్తోంది. కాగా మిడిల్ ఈస్ట్‌లోని అనేక ప్రాంతాల్లో అగ్రరాజ్యం సైనిక, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే ఆ దేశం తన క్షిపణుల పరిధిలో ఉన్న సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఇరాక్, టర్కీలోని అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.