అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి జిల్లావ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP nizamabad) పేర్కొన్నారు. నిజాంసాగర్ కెనాల్ (Nizamsagar Canal) దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని కోరుతూ.. శుక్రవారం నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో తగినంత వర్షపాతం లేకపోవడం, నిజాంసాగర్ కెనాల్ నుంచి సాగునీరు విడుదల చేయకపోవడం వల్ల వరి పంట ఎండిపోతోందన్నారు. దీంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారన్నారు.
Dinesh Kulachari | పెట్టుబడులు నిరుపయోగమే..
ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల రూపంలో పెట్టిన పెట్టుబడులు నిరుపయోగంగా మారాయని దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితిపై స్పందించాల్సిన ప్రభుత్వం గాఢనిద్రలో ఉందన్నారు. రైతుల ప్రాణాలతో ఆటలాడుతోందని విమర్శించారు.
వినతిపత్రం అందించిన వారిలో రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి (Mohan Reddy), రూరల్ కో–కన్వీనర్ పద్మా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, నాయకులు మాస్టర్ శంకర్, పంచ రెడ్డి శ్రీధర్, ప్రమోద్, జగన్ రెడ్డి, నారాయణ యాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.