అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Protest | ఇరాన్లో సుప్రీం నేత ఖమేనీ (Supreme Leader Khamenei)కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ప్రజలు నిరసన తెలిపారు.
ఇరాన్లో రెండు రోజులుగా జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ రియాద్ విలువ పడిపోవడంతో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే నిరసనకారులను ప్రభుత్వం అణిచివేస్తుంది. ఇరాన్లో ఆందోళనలపై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. నిరసనకారులపై కాల్పులు జరపవద్దని, వారిని రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. దీనిపై ఇరాన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలను ఖండించింది. అగ్రరాజ్యం దాడులకు పాల్పడితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. తాగాగా ఆ దేశం ట్రంప్‌పై ఐక్యారాజ్య సమితిని ఆశ్రయించింది.
Iran Protest | అమెరికా బాధ్యత వహించాలి
ట్రంప్ తీరుపై అంతర్జాతీయ ఖండన కోరుతూ ఐక్యరాజ్యసమితిని ఇరాన్ ఆశ్రయించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షుడికి ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరావానీ లేఖ రాశారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు తమకు ఉందన్నారు. దేశంలో ఏదైనా ఉద్రిక్తతకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు UN చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడంగా పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్గత అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.