అక్షరటుడే, వెబ్‌డెస్క్: Scoda Tubes IPO | స్టెయిన్‌లెస్ ట్యూబ్‌లు, పైపుల తయారీదారు అయిన స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్(Scoda Tubes Ltd) బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యింది. ఇష్యూ ప్రైస్(Issue price) రూ. 140 వద్దే ట్రేడింగ్ ప్రారంభించినా.. వెంటనే 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
స్కోడా ట్యూబ్స్ కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 220 కోట్లు సమీకరించడం కోసం మెయిన్ బోర్డ్ ఐపీవో(IPO)గా వచ్చింది. గతనెల 28వ తేదీనుంచి 30 వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. రిటైల్ కోటా(Retail quota) 20.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం బీఎస్‌ఈ(BSE)తోపాటు ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో ట్రేడింగ్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. లిస్టింగ్ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 5 శాతం పెరిగి రూ. 147 వద్ద నిలిచింది.
Scoda Tubes IPO | ఎన్‌ఎస్‌ఈలో మరో రెండు..
ఎన్‌ఎస్‌ఈ(NSE)లో ఒక మెయిన్ బోర్డ్ ఐపీవోతోపాటు మరో రెండు ఎస్‌ఎంఈ(SME) ఐపీవోలు లిస్టయ్యాయి.
మార్కెట్‌నుంచి రూ. 73.20 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన నెప్ట్యూన్ పెట్రో కెమికల్స్(Neptune Petrochemicals) ఐపీవోకు వచ్చింది. ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ. 122 కాగా.. బుధవారం రూ. 132.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇన్వెస్టర్లకు 8.81 శాతం లాభాలను అందించింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో 133.95 (9.8 శాతం లాభం) వద్ద ఉంది.
ఎన్‌ఆర్ వందన టెక్స్‌టైల్(NR Vandana Textile) కంపెనీ రూ. 27.89 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఐపీవో ప్రారంభ ధర రూ. 45 కాగా.. అదే ధర వద్ద లిస్టయ్యింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో 2.78 శాతం నష్టంతో 43.75 వద్ద కొనసాగుతోంది.