IPO
IPO Listing | లాభాల పంట పండిరచిన ఐపీవో.. ఒక్కరోజులోనే డబుల్‌ అయిన సంపద

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO Listing | స్టాక్‌ మార్కెట్‌లో (Stock Market) ఐపీవోల (IPO) సందడి కొనసాగుతోంది. గురువారం ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీ లిస్టయ్యింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. తొలిరోజే సంపదను దాదాపు డబుల్‌ చేసింది.

బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ విభాగానికి చెందిన ఎయిర్‌ఫ్లోవా రైల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (Airfloa Rail Technology Company) ఐపీవోకు వచ్చింది. ఈనెల 11 నుంచి 13 వరకు సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ. 91.10 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీకి ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 301.52 రెట్లు సబ్‌స్క్రైబ్‌ కాగా.. రిటైల్‌ కోటా 330.31 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈలో లిస్టయ్యాయి.

గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 140 కాగా.. 90 శాతం గరిష్ట ప్రీమియంతో రూ. 266 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి ఒక్కో షేరుపై రూ. 126 లాభం వచ్చింది.
ఒక లాట్‌లో వెయ్యి షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్‌ల కోసం రూ. 2.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. అంటే ఐపీవో అలాట్‌ అయిన రిటైల్‌ ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌ సమయంలోనే రూ. 2,52,000 లాభం వచ్చిందన్నమాట. ఈ కంపెనీ షేర్లు లిస్టయిన కొద్దిసేపటికే రూ. 279.30 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. తొలిరోజే ఇన్వెస్టర్లకు రూ. 2.78 లక్షల లాభాన్ని ఈ కంపెనీ అందించింది.