అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | ఆసియాలోనే అతి పెద్ద డయాలిసిస్ సేవల సంస్థ, అంతర్జాతీయంగా అయిదో అతి పెద్దదైన (ఎఫ్అండ్ఎస్ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో చికిత్సల సంఖ్యాపరంగా), నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహించే నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ (Nephrocare Health Services) తమ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) (IPO) సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. దీని ప్రకారం తాజాగా షేర్ల జారీ ద్వారా రూ. 353.4 కోట్లు సమీకరించనుండగా, సెల్లింగ్ షేర్‌హోల్డర్లు 1,27,92,056 షేర్లను (1.27 కోట్ల షేర్లు) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు.
హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నెఫ్రోప్లస్ 2009లో ఏర్పాటైంది. భారత్‌లో 21 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 269 నగరాలవ్యాప్తంగా 447 క్లినిక్‌లను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా ఏటా 33,000 మంది పేషంట్లకు సేవలు అందిస్తోంది. చికిత్సల సంఖ్యపరంగా దేశీయంగా సంఘటిత మార్కెట్ ఆదాయాల్లో 50 శాతం పైగా మార్కెట్ వాటా కలిగి ఉంది. అటు ఫిలిప్పీన్స్(34 క్లినిక్‌లు), ఉజ్బెకిస్తాన్ (4 క్లినిక్‌లు), నేపాల్ (5 క్లినిక్‌లు)తో పాటు కింగ్‌డం ఆఫ్ సౌదీ అరేబియా (Kingdom of Saudi Arabia) ద్వారా మధ్యప్రాచ్యం మార్కెట్లోకి కూడా కంపెనీ ప్రవేశించింది. 2025 31 మార్చి నాటికి నెఫ్రోప్లస్‌కి 5,000 డయాలిసిస్ మెషిన్లు ఉండగా, 33 లక్షల పైచిలుకు చికిత్సలు అందించింది.
విక్రమ్ ఉప్పల, బీవీపీ (బెస్సీమర్ వెంచర్ పార్ట్‌నర్స్) ట్రస్ట్, ఎడోరాస్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్, హెల్త్‌కేర్ పేరెంట్ లిమిటెడ్ (హెచ్‌పీఎల్), ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ II (Investcorp Private Equity Fund II), ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్ సెల్లింగ్ షేర్ హోల్డర్లయిన ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ II, హెల్త్‌కేర్ పేరెంట్ లిమిటెడ్, ఇన్వెస్ట్‌కార్ప్ గ్రోత్ ఆపర్చూనిటీ ఫండ్, ఎడోరాస్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ Pte. లిమిటెడ్, అలాగే ఇతర సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన ఇన్వెస్ట్‌కార్ప్, ఇండియా ప్రైవేట్ ఈక్విటీ ఆపర్చూనిటీ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, 360 వన్ స్పెషల్ ఆపర్చూనిటీస్ ఫండ్ – సిరీస్ 9 మరియు 360 వన్ స్పెషల్ ఆపర్చూనిటీస్ ఫండ్ – సిరీస్ 10 షేర్లను విక్రయించనున్నాయి.
తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 129.1 కోట్లను భారత్‌లో కొత్త డయాలిసిస్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు, కంపెనీ తీసుకున్న నిర్దిష్ట రుణాలను తీర్చేసేందుకు రూ. 136 కోట్లు, మిగతా మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.