అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూల(Public issues) జాతర కొనసాగుతోంది. ఈ వారంలో పది కంపెనీలు ఐపీవో(IPO)కు వస్తున్నాయి. ఇందులో మూడు మెయిన్ బోర్డ్ కంపెనీలు ఉండగా.. ఏడు ఎస్ఎంఈ సెగ్మెంట్‌కు చెందినవి. మరో ఎనిమిది కంపెనీలు లిస్టింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
మెయిన్ బోర్డు(Main board) విభాగంలో శ్రింగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, దేవ్ యాక్సిలరేటర్, అర్బన్ కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. మూడింటి సబ్‌స్క్రిప్షన్ ఈనెల 10 ప్రారంభమై 12న ముగుస్తుంది. 15న అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడవుతుంది. మూడు కంపెనీల షేర్లు ఈనెల 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి. ఎస్‌ఎంఈ(SME) సెగ్మెంట్‌నుంచి వస్తున్న ఐపీవోలలో ఆరు బీఎస్‌ఈకి చెందినవి కాగా ఒకటి ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానుంది.
శ్రింగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర : శ్రింగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర(Shringar House of Mangalsutra) కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 400.95 కోట్లు సమీకరించాలన్న లక్ష్యతో ఐపీవోకు వస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ధరల శ్రేణిని రూ.155 నుంచి రూ.165గా నిర్ణయించింది.
దేవ్ యాక్సిలరేటర్ : దేవ్ యాక్సిలరేటర్(Dev Accelerator) కంపెనీ ఐపీవో ద్వారా రూ. 143.35 కోట్లు సమీకరించనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారానే ఈ మొత్తాన్ని సమీకరిస్తారు. ధరల శ్రేణి రూ. 56 నుంచి రూ.61 గా ఉంది.
అర్బన్ కంపెనీ : అర్బన్ కంపెనీ(Urban Company) ఐపీవో ద్వారా రూ. 1,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 472 కోట్లు సమీకరించనుండగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించనున్నారు. కంపెనీ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 98 నుంచి రూ. 103 గా నిర్ణయించారు.
ఎస్ఎంఈ ఐపీవోలు : స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(SME) సెగ్మెంట్ నుంచి 7 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. ఈ జాబితాలో కృపాల్ మెటల్స్, నీలాచల్ కార్బో మెటాలిక్స్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 8న మొదలవుతుంది. కార్బన్ స్టీల్ ఇంజినీరింగ్, తౌరియాన్ ఎంపీఎస్ సబ్‌స్క్రిప్షన్ 9న ప్రారంభమవుతుంది. జయ్ అంబే సూపర్ మార్కెట్స్, ఎయిర్ ఫ్లో రైల్ టెక్నాలజీ(Airfloa Rail Technology), ఎల్టీ ఎలవేటర్ కంపెనీల సబ్‌స్క్రిప్షన్ 10వ తేదీ నుంచి మొదలవుతుంది.
లిస్టింగ్‌లు : మెయిన్ బోర్డుకు చెందిన అమంతా హెల్త్‌కేర్(Amanta Healthcare) కంపెనీ మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ కానుంది. ఎస్ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన రచిత్ ప్రింట్స్ 9న, జియోల్ కన్‌స్ట్రక‌్షన్, ఆప్టివాల్యూ టెక్ కన్సల్టింగ్ కంపెనీలు 10న లిస్టవుతాయి. ఆస్టర్ సిస్టమ్(Austere Systems), విగోర్ ప్లాస్ట్ ఇండియా, శర్వాయా మెటల్స్ కంపెనీలు 12న స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.