అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం రెండు ఐపీవోలు (IPO) లిస్టయ్యాయి. ఒకటి మెయిన్‌బోర్డుకు (Mainboard) చెందినది కాగా.. మరొకటి ఎస్‌ఎంఈ (SME) సెగ్మెంట్‌కు చెందినది. మెయిన్‌బోర్డు ఐపీవో దుమ్ము రేపగా.. ఎస్‌ఎంఈ ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
IPO | 38 శాతం లాభాలిచ్చిన రీగాల్ రీసోర్సెస్..
రీగాల్ రీసోర్సెస్ (Regaal Resources) మార్కెట్‌నుంచి రూ. 306 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఈనెల 12 నుంచి 14 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. ఐపీవో 190.96 శాతం రెట్లు సబ్‌స్క్రైబ్ (Subscribe) కాగా.. రిటైల్ కోటా 57.75 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. కంపెనీ షేర్లు బుధవారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 102 కాగా.. బుధవారం రూ. 141 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 38 శాతం లాభాలు వచ్చాయన్న మాట. ఐపీవోలో ఒక లాట్‌లో 144 షేర్లున్నాయి. ఐపీలో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో రూ. 5,616 లాభం (Profit) వచ్చింది. లిస్టింగ్ తర్వాత షేరు ధర మరో నాలుగు రూపాయలు పెరిగింది. ఆ తర్వాత ఇంట్రాడేలో రూ. 132కు పడిపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 133.70 వద్ద ట్రేడ్ అవుతోంది.
IPO | ముంచేసిన మహీంద్రా రియల్టర్స్..
మహీంద్రా రియల్టర్స్ (Mahendra Realtors) ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 49.45 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ 43.57 రెట్టు సబ్‌స్క్రైబ్ కాగా… రిటైల్ కోటా 25.59 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. అయితే ఇది లిస్టింగ్‌లో (Listing) నిరాశ పరిచింది. గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 85 కాగా.. 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 68 వద్ద లిస్టయ్యింది. వెంటనే మరో ఐదు శాతం తగ్గి రూ. 64.60 వద్ద లోయర్ సర్క్యూట్ (Lower circuit) కొట్టింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజే 24 శాతం నష్టాన్ని ఇచ్చింది. ఐపీవోలో రెండు లాట్‌లు కలిపి 1,600 షేర్ల కోసం రూ. 1.36 లక్షలు ఇన్వెస్ట్ చేసినవారికి తొలిరోజు రూ. 32,640 నష్టం(Loss) వచ్చింది.