అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2026 | ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ఆసక్తికర మలుపులతో ముగిసింది. ఈసారి అన్ని ఫ్రాంచైజీలు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కామెరూన్ గ్రీన్, మతీశా పతిరానా వంటి విదేశీ ఆటగాళ్లకు భారీ ధరలు దక్కగా, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి దేశవాళీ అన్క్యాప్డ్ ఆటగాళ్లపై కూడా డబ్బు వర్షం కురిసింది.
అయితే కొందరు స్టార్ ప్లేయర్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వేలం ముగిసే సరికి పది జట్ల స్క్వాడ్లు దాదాపుగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ స్టార్స్ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌పై భారీగా ఖర్చు చేయడంతో పాటు ట్రేడ్ ద్వారా సంజు శాంసన్‌ను తీసుకుని బ్యాటింగ్‌ను బలోపేతం చేసింది.
IPL 2026 | ఇంట్రెస్టింగ్ బిడ్..
కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లతో కామెరూన్ గ్రీన్ (Cameron Green)ను దక్కించుకుని ఈ వేలంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగి నిలిచాడు. మతీశా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్‌తో బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసింది. ముంబై ఇండియన్స్ తమ కోర్ టీమ్‌పై నమ్మకంతో పరిమిత కొనుగోళ్లకే పరిమితమై, క్వింటన్ డికాక్‌ను తక్కువ ధరకే దక్కించుకోవడం విశేషంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) విరాట్ కోహ్లీ నేతృత్వంలో వెంకటేష్ అయ్యర్‌ను తీసుకుని మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అనూహ్యంగా లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసి పవర్ హిట్టింగ్‌పై దృష్టి పెట్టింది. పంజాబ్ కింగ్స్ యువ ఆటగాళ్లు, బౌలర్లపై ఫోకస్ పెట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) పృథ్వీ షాను తిరిగి బేస్ ప్రైస్‌కే దక్కించుకుని డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడిలాంటి అనుభవజ్ఞులను జట్టులోకి చేర్చుకుంది.
రాజస్థాన్ రాయల్స్ ట్రేడింగ్ ద్వారా రవీంద్ర జడేజా (Ravindra Jadeja), శామ్ కర్రాన్‌లను తీసుకుని తమ స్క్వాడ్‌ను మరింత బలంగా మార్చగా, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జాసన్ హోల్డర్‌తో ఆల్‌రౌండ్ బలాన్ని పెంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ వనిందు హసరంగా, ఎన్రిక్ నోర్ట్జేను కొనుగోలు చేసి బౌలింగ్‌ను సమతుల్యం చేయగా, ట్రేడ్ ద్వారా మొహమ్మద్ షమీని దక్కించుకోవడంతో వారి బౌలింగ్ విభాగం మరింత ప్రమాదకరంగా మారింది. మొత్తం మీద ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అనూహ్య కొనుగోళ్లు, భారీ బిడ్స్, ట్రేడ్లతో అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త సీజన్లో జట్ల బలం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.