అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2026 Mini Auction | ఐపీఎల్ 2026 మినీ వేలానికి తెరలేచింది. అబుదాబి (Abu Dhabi) వేదికగా జరుగుతున్న ఈ వేలం క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) పేరు మార్మోగిపోయింది.
వేలానికి ముందే గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతుండటంతో, అతను ఈ వేలంలోని హాట్ టాపిక్‌గా మారాడు. చివరికి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రికార్డు స్థాయి ధర వెచ్చించి గ్రీన్‌ను తమ జట్టులోకి తీసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన బిడ్డింగ్‌లో కామెరాన్ గ్రీన్ ఏకంగా రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కొనుగోళ్లలో ఒకటిగా నిలిచింది. KKR ఈ స్థాయిలో మొత్తం వెచ్చించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
IPL 2026 Mini Auction | హోరాహోరీగా సాగిన బిడ్డింగ్ యుద్ధం
గ్రీన్ కోసం వేలం పాట ఓ యుద్ధంలా సాగింది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రూ.2 కోట్లతో బిడ్డింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ (RR) పోటీలోకి దిగింది. RR–KKR మధ్య తీవ్ర పోటీ నడిచింది. అయితే రూ.13.60 కోట్ల వద్ద రాజస్థాన్ పర్సు ఖాళీ కావడంతో రేసు నుంచి తప్పుకుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ.13.80 కోట్లతో ఎంట్రీ ఇచ్చింది. CSK, KKR మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా పోటీ సాగింది. ధర రూ.19 కోట్లకు చేరుకున్నా KKR వెనక్కి తగ్గలేదు. చివరికి రూ.25.20 కోట్ల భారీ మొత్తంతో గ్రీన్‌ను దక్కించుకుంది.
వెంకటేష్ అయ్యర్ (Venkatesh Ayyer) వంటి కీలక ఆటగాళ్లను వదులుకున్న తర్వాత KKRకు నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్ అవసరమైంది. కోల్‌కతా పిచ్ బౌన్స్, పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. గ్రీన్ హైట్, బౌలింగ్ స్టైల్ అక్కడ మరింత ప్రమాదకరంగా మారుతాయి. మిడిల్ ఆర్డర్లో గ్రీన్ పవర్ హిట్టింగ్ KKR బ్యాటింగ్‌కు అదనపు బలం ఇస్తుంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడిన గ్రీన్ ఇప్పటికే ఐపీఎల్లో తన సత్తా చాటాడు.
సెంచరీలు, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో అభిమానులను అలరించాడు. ఇప్పుడు పర్పుల్ జెర్సీలో అతను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాల్సిందే. రూ.25.20 కోట్ల ధరను న్యాయపరచాలంటే రాబోయే సీజన్లో బ్యాట్, బాల్‌తో అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. కాగా, మినీ వేలంలో రూ.25.20 కోట్ల ధరకు అమ్ముడుపోయినప్పటికి కూడా కామెరూన్ గ్రీన్‌కు రూ.18 కోట్లు మాత్రమే జీతంగా రానుంది. మిగిలిన రూ.7.20 కోట్లు బీసీసీఐ ఖాతాలో పడనున్నాయి.