అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2026 | ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తొలి మ్యాచ్ మార్చి 26వ తేదీన ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇక వేలం విషయానికి వస్తే.. రేపు (డిసెంబర్ 16, 2025న) అబుదాబిలో చేపడుతున్నారు.
IPL 2026 | ఆటగాళ్ల లభ్యతపై ప్రభావం..
ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని మొదట మార్చి 15గా ప్రకటించారు. తాజాగా దీనిని మార్చి 26వ తేదీకి మార్చారు. ఈ సీజన్ మే 31, 2026 వరకు కొనసాగనుంది. కాగా, మార్చి 26 నుంచి మే 3 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఉన్నందున.. IPL – PSL మధ్య ఓవర్ లాప్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఐపీఎల్‌కు ఆటగాళ్ల లభ్యతపై ప్రభావం చూపొచ్చు. ఈసారి మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కోసం ఈసారి అద్భుతమైన స్పందన లభించింది. మొత్తం 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా రికార్డు సృష్టించారు. క్రిక్‌బజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది ఇప్పటివరకు మినీ వేలం కోసం నమోదైన అత్యధిక సంఖ్య.
మొత్తం 10 జట్లలో కలిపి 77 ఖాళీలు (31 విదేశీ స్లాట్లు) మాత్రమే ఉన్నా ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్ల పర్స్ ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వద్ద రూ. 43.4 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 16న జరగబోయే ఈ వేలంలో ఫ్రాంచైజీలు ఎవరిని సొంతం చేసుకుంటాయనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది.