Mission Bhagiratha
Mission Bhagiratha | భగీరథ పన్ను వసూళ్లపై విచారణ.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘అక్షరటుడే’ కథనం..

అక్షరటుడే, కామారెడ్డి: Mission Bhagiratha | మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీటికి సంబంధించి కామారెడ్డి జిల్లాల్లో పన్ను వసూలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

మిషన్ భగీరథ నీటికి పన్ను వసూళ్లపై ‘నీటి పన్ను కట్టాల్సిందే’ అనే శీర్షికన ఈనెల 1న ‘అక్షరటుడే’లో (Akshara Today Article) కథనం ప్రచురితం కాగా.. అధికారుల్లో చలనం మొదలైంది. గ్రామాల్లో స్థానిక సిబ్బంది మిషన్​ భగీరథ నీళ్లు వాడుకుంటున్న ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తుండడంతో ప్రజలు ఆగమయ్యారు. ఈ పరిస్థితిని ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం చేయడంతో అసలు నీటి పన్ను కట్టాలా? వద్దా? అనే చర్చ గ్రామాల్లో మొదలైంది.

మిషన్ భగీరథ, పంచాయతీ అధికారుల విభిన్న సమాధానాలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్​ నాయక్​ (Additional Collector Chander Nayak) క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు.

Mission Bhagiratha | తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో..

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ గురువారం తాడ్వాయి (Tadwai) మండలం కృష్ణాజివాడి (Krishnajiwadi) గ్రామంలో విచారణ చేపట్టారు. పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? నీళ్లు సరిపడా రాకపోవడానికి గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు ఏ మేరకు సరఫరా అవుతున్నాయి..? పంచాయతీలకు సంబంధించిన బోర్లు ప్రారంభం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు.

Mission Bhagiratha | నీళ్లు సరిపోవట్లేదు..

‘మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు సరిపోవడం లేదు. అందుకే పంచాయతీ బోర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నాం. భగీరథ నీటితో సగం ట్యాంక్ కూడా నిండటం లేదు. బోర్ మోటార్, ఇతర మెయింటెనెన్స్ కోసం మినిమం బిల్లు వసూలు చేస్తున్నాం’ అని పంచాయతీ అధికారులు అదనపు కలెక్టర్ కు వివరణ ఇచ్చారు.

Mission Bhagiratha | కామారెడ్డిలోనే బయటపడ్డ పన్ను వసూలు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా మిషన్ భగీరథ నీటికి పన్ను వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కామారెడ్డి జిల్లాలో ఈ పన్ను వసూళ్లు అంశం మొదట బయటకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసినట్టుగా తెలుస్తోంది. అందుకే కామారెడ్డి జిల్లా నుంచే అధికారులు విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో కూడా ఈ పరిస్థితిపై విచారణ జరుపనున్నట్టు సమాచారం.

ప్రభుత్వానికి నివేదిస్తాం

– అదనపు కలెక్టర్ చందర్ నాయక్

గ్రామాల్లో నీటి సరఫరా పరిస్థితి, పన్ను వసూళ్లకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపడుతున్నాం. పంచాయతీ అధికారులు, భగీరథ అధికారుల వద్ద వివరణ తీసుకున్నాం. సరిపడా తాగునీరు సరఫరా చేయలేకపోతున్నామని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా పంచాయతీ బోర్ల ద్వారా నీళ్లు ఇస్తున్నామని పంచాయతీ అధికారులు తెలిపారు. పూర్తి నివేదిక కలెక్టర్​కు అందజేస్తాం. అక్కడినుంచి పంచాయతీ రాజ్ కమిషనర్​కు నివేదిక పంపిస్తాం.