అక్షరటుడే, వెబ్డెస్క్ : Indigo Crisis | ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇటీవల వేలాది ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.
ఇండిగో విమానాల (Indigo Flights) రద్దుకు దారితీసిన పరిస్థితులపై విచారణకు డిసెంబర్ 5న కమిటీని ఏర్పాటు చేశారు. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె బ్రహ్మణే నేతృత్వంలోని విచారణ కమిటీ తన నివేదికను శుక్రవారం సాయంత్రం సమర్పించింది. బ్రాహ్మణే నేతృత్వంలోని ప్యానెల్లో DGCA డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ మరియు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ రాంపాల్ సభ్యులుగా ఉన్నారు.
Indigo Crisis | కీలక అంశాలు
ఇండిగో విమానాల రద్దుకు కారణాలు, రోస్టర్ వ్యవస్థ గురించి ఈ కమిటీ వివరాలు సేకరించింది. విస్తృతమైన కార్యాచరణ అంతరాయాలకు దారితీసిన కారణాలను గుర్తించింది. ప్రణాళిక వైఫల్యాలకు గల కారణాలపై ఆరా తీసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా కార్యాలయంలో అందజేసింది. అయితే నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. పూర్తి నివేదిక వివరాలు ఇంకా బయటకు రాలేదు.
Indigo Crisis | కఠిన చర్యలకు సిఫారసు
డిసెంబర్ ప్రారంభంలో ఇండిగో విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులు వేలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇండిగో టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తోంది. అలాగే రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు (Travel Vouchers) అందజేస్తోంది. తాజాగా కమిటీ ఇండిగో సంక్షోభానికి గల కారణాలను నివేదికలో పొందుపరిచింది. ఇండిగోకు భారీ జరిమానాతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్లో ఇండిగో లాంటి సంక్షోభాలు తలెత్తుకుండా కమిటీ సూచనలు, సలహాలు చేసినట్లు తెలుస్తోంది.