అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA Series | నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో (South Africa) మొదలయ్యే తొలి టెస్టుకు టీమిండియా (Team India) తుది జట్టు విషయంలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. జట్టులో చాలా మంది ఆటగాళ్ల స్థానాలు స్పష్టమైనప్పటికీ, ఆరో స్థానానికి (నంబర్ 6) ముగ్గురు కీలక ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లలో ఎవరికి స్థానం దక్కనుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది. యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా-ఏపై జరిగిన అనధికారిక టెస్టుల్లో వరుసగా రెండు సెంచరీలు (132 నాటౌట్, 127 నాటౌట్) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రిషబ్ పంత్ (Rishabh Pant) తిరిగి రావడంతో, జురెల్‌ను వికెట్‌కీపర్‌గా కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా నంబర్ 6లో ఆడించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
IND vs SA Series | ఛాన్స్ ఎవరికి..
నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy) సీమర్ ఆల్‌రౌండర్‌గా టీంకు బౌలింగ్ డెప్త్ అందించగలడు. ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) పిచ్ ప్రారంభంలో పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే భారత జట్టు సాధారణంగా స్పిన్ ప్రధాన వ్యూహాన్ని అనుసరించే కారణంగా, నితీష్ అవకాశాలు కొంత తక్కువగానే కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌లో కూడా ప్రతిభ చూపగల ఈ యువ ఆటగాడు భవిష్యత్తులో స్థిర స్థానాన్ని సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత టెస్ట్‌లో మాత్రం జురెల్ ఫామ్ అతనికి సవాల్‌గా మారింది. అనుభవజ్ఞుడు అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా మంచి ఆప్షన్. లోయర్ ఆర్డర్లో అవసరమైనప్పుడు పరుగులు చేయగల సామర్థ్యం ఉంది. అయితే జట్టులో ఇప్పటికే జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నందున, ఈ టెస్ట్‌లో అక్షర్‌కు అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
బ్యాటింగ్ బలాన్ని పెంచాలనుకుంటే జురెల్ ఎంపిక అవ్వడం ఖాయం. బౌలింగ్ డెప్త్ కావాలనుకుంటే నితీష్ లేదా అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక భారత జట్టు మేనేజ్మెంట్ స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌ను కోరిందా అని గంగూలీని మీడియా ప్రశ్నించగా.. “వారు ఇప్పటివరకు దాని గురించి ఏమి అడగలేదు. అందుకే నేను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వదలుచుకోలేదు. పిచ్ మాత్రం చాలా బాగుంది” అని గంగూలీ బదులిచ్చారు. ఈ సీజన్లో ఈడెన్ గార్డెన్స్ రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా, ఆ సమయంలో పిచ్‌లు నెమ్మదిగా ఉండి, ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకరించలేదు. ఈ చారిత్రక సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని, టాస్ వేయడానికి మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా చిత్రాలు ఉన్న ప్రత్యేక కాయిన్‌ను విడుదల చేసినట్లు గంగూలీ చెప్పుకొచ్చారు.